Prices Increase: 22 శాతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పండుగ పూట పెరిగిన ధరలతో సర్వత్రా ఆందోళన-22 percent increase in the prices of essential commodities there is widespread concern with the increased prices ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Prices Increase: 22 శాతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పండుగ పూట పెరిగిన ధరలతో సర్వత్రా ఆందోళన

Prices Increase: 22 శాతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పండుగ పూట పెరిగిన ధరలతో సర్వత్రా ఆందోళన

HT Telugu Desk HT Telugu
Sep 27, 2024 05:09 AM IST

Prices Increase: పండుగల వేళ నిత్యావసర సరుకుల ధరలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పప్పు, వంట నూనెల ధరలు 22 శాతం పెరిగాయి. ఉల్లి సెంచరీకి చేరువలో ఉండగా, ఎల్లిపాయలు 400 ధర పలుకుతుంది. ఇక పప్పు వంటనూనెల ధరలు కేజీకి 20 రూపాయల వరకు పెరిగింది.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆందోళన
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆందోళన

Prices Increase: కారణం ఏదైనా నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుడు ఏమికొనేటట్లు లేదు... ఏమి తినేటట్లు లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.

వర్షం వరదలతో కూరగాయల తోటలు దెబ్బతిని, ట్రాన్స్ పోర్ట్ సరిగా లేక కూరగాయల ధరలు పెరుగుతుండగా తామేం తక్కువ కాదంటూ పప్పులు, నూనెలు ఇతర నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల వంటింటి బడ్జెట్ రెండింతలవుతోంది. నెల రోజుల క్రితం పప్పులు, నూనెల ధరలు తక్కువగా ఉండగా తాజాగా అమాంతం పెరిగాయి. 

కందులు, పెసర మార్కెట్ వచ్చినపుడు మాత్రం కనీస మద్దతు ధరకు అతి తక్కువగా కొనుగోలు చేస్తుండగా పప్పుల ధరలు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. గతంలోనే పప్పులపై పన్నులను కేంద్రం పూర్తిగా ఎత్తివేయగా ధరలు నేల చూపులు చూడాల్సి ఉండగా పెరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ధరలు ఇష్టారీతిగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుండగా నియంత్రించాల్సిన విభాగం మొద్దునిద్రను వీడడం లేదు.

సుంకం పెంపుతో వంట కాగుతున్న నూనె ధరలు

కేంద్ర ప్రభుత్వం వంట నూనెలు నిత్యావసర సరుకులపై ఈనెల 14 అర్థరాత్రి 20శాతం సుంకం విధించింది. దీంతో మార్కెట్లో ధరలు మండిపోతున్నాయి. సుంకం పెంపు తరువాయి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తమ వద్ద భారీ ఎత్తున స్టాక్ ఉండగా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పాత స్టాక్ కు కొత్త ధరలకు విక్రయిస్తున్నారు. లీటరు ప్యాకెట్ పై గరిష్టంగా రూ.40 పెంచి వినియోగదారుల జేబును గుల్ల చేస్తున్నారు. పామాయిల్ ధర పక్షం రోజుల క్రితం రూ.80 ఉండగా తాజాగా రూ.110కి, సన్ ఫ్లవర్ రూ.130, పల్లీ నూనె రూ.190కి, రైస్ బ్రాన్ రూ. 140 లకు విక్రయిస్తున్నారు.

సెంచరీకి చేరువలో ఉల్లి...400 పలుకుతున్న ఎల్లిపాయ…

ఉల్లి చేసిన మేలు తల్లీ కూడా చేయదు అంటారు... ఉల్లి కోస్తే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి.. కానీ ఇప్పుడు ఉల్లి ధర వింటేనే కళ్ళ వెంట నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ లో ఎర్ర ఉల్లిగడ్డ హోల్ సెల్ గా కిలో 60 రూపాయలు, తెల్ల ఉల్లిగడ్డ 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. సెంచరీ చేరువలో ఉల్లి ధర ఉండగా ఇక ఎల్లిపాయ ధర కిలో 400 పలుకుతుంది.

కృత్రిమ కొరతతో వ్యాపారుల దోపిడీ

ఇతర ప్రాంతాల నుంచి పప్పులు ఇతర నిత్యావసర సరుకులు జిల్లాకు దిగుమతి జరుగుతోంది. ఇక్కడి నుంచి గ్రామాలకు ఎగుమతి జరుగుతోంది. జీఎస్టీ అమలు తర్వాత పన్నులను తొలగించినందున గతంలో విక్రయించిన దానికన్నా తక్కువ ధరలకు పప్పులను విక్రయించాలి. కానీ హోల్ సెల్ మార్కెట్లో కిలో కంది రూ.170, పెసర పప్పు రూ.150ల చొప్పున విక్రయించగా చిరువ్యాపారులు కందిపప్పు రూ.180, పెసర రూ.160 చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నారు. 

జిల్లావ్యాప్తంగా రోజుకు రెండు లారీల కందిపప్పు వినియోగం జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతుండగా ఒక్క లారీలో పదివేల కిలోల పప్పు ఉంటోంది. ఈ లెక్కన కిలోకు అదనంగా రూ.20వ రకు దోచుకుంటున్నారు. అంటే ఒక్కో లారీకి అదనంగా రూ.2లక్షలవుతుండగా రెండు లారీలకు రోజుకు రూ.4లక్షల వరకు అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. పెసర పప్పు కూడా అంతే భారం పడుతోంది. కంది, పెసర పప్పులపై రోజుకు రూ.8లక్షల చొప్పున నెలకు రూ.2.40కోట్ల భారం వినియోగదారులపై పడుతోంది.

ధరల పెరుగుదలపై సిపిఐ ఆందోళన

నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో కరీంనగర్ లో సిపిఐ కార్యకర్తలు వినూత్న ఆందోళనకు దిగారు. ధరలు పెరిగిన నిత్యవసర వస్తువులను నెత్తిన పెట్టుకొని ప్రధాన కూరగాయల మార్కెట్ లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు.‌ పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు. 

ధరల పెరుగుదలను పసిగట్టి నిత్యవసర వస్తువులను వ్యాపారులు బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు మరింత పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే వ్యాపారుల గోదాములపై దాడులు చేసి వాటిని పేదలకు పంచుతామని హెచ్చరించారు. ధరల నియంత్రణ కోసం తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)