WPL vs PSL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం చూసి పాకిస్థాన్ ప్లేయర్స్‌ను తెగ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్-wpl vs psl as fans troll pakistan players after watching wpl auction ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wpl Vs Psl: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం చూసి పాకిస్థాన్ ప్లేయర్స్‌ను తెగ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

WPL vs PSL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం చూసి పాకిస్థాన్ ప్లేయర్స్‌ను తెగ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Feb 13, 2023 06:06 PM IST

WPL vs PSL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) వేలం చూసి పాకిస్థాన్ ప్లేయర్స్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఈ వేలంలో స్మృతి మంధానా పలికిన ధరతో పోలిస్తే పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) లో బాబర్ ఆజంకు దక్కింది ఎంత అంటూ ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (AFP)

WPL vs PSL: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)ను తరచూ ఐపీఎల్ తో పోలుస్తుంటారు అక్కడి క్రికెటర్లు, అభిమానులు. ఐపీఎల్ కంటే కూడా తమ లీగ్ చాలా కఠినమైనదని అంటుంటారు. కానీ తీరా చూస్తే ఆ లీగ్ లో టాప్ ప్లేయర్స్ కు దక్కుతున్న మొత్తం చూస్తే.. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) కంటే కూడా చాలా చాలా తక్కువని తాజా వేలంతో తేలిపోయింది.

దీంతో కనీసం డబ్ల్యూపీఎల్ తో కూడా పోటీ పడలేని వాళ్లు ఐపీఎల్ తో పోల్చుకోవడం ఏంటని ట్విటర్ లో ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ అయిన బాబర్ ఆజం పీఎస్ఎల్ లో అందుకుంటున్న మొత్తాన్ని వాళ్లు ఎత్తి చూపుతున్నారు. అంత పెద్ద ప్లేయర్ కు కూడా మన కరెన్సీలో చూస్తే కేవలం రూ.1.3 కోట్లు మాత్రమే దక్కతున్నాయి.

అదే డబ్ల్యూపీఎల్ లో మాత్రం ఇండియన్ వుమెన్స్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధానాకు ఏకంగా రూ.3.4 కోట్ల మొత్తం దక్కింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రూ.1.8 కోట్లు పలకడం విశేషం. ఆ లెక్కన చూస్తే బాబర్ ఆజం ఎంత అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కనీసం ఇండియాలో మహిళా క్రికెటర్లకు దక్కే మొత్తం కూడా పాకిస్థాన్ లో అక్కడి మెన్స్ టాప్ క్రికెటర్లకు దక్కడం లేదన్న విషయాన్ని ఎత్తి చూపించారు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఏ ప్లేయర్ కు ఎంత?

నిజానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ లో వేలానికి బదులు డ్రాఫ్ట్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారు. అంటే ప్లేయర్స్ ను మూడు కేటగిరీలుగా విభజించి వాళ్లకు ధర నిర్ణయిస్తారు. ఇందులో టాప్ కేటగిరీలో ఉన్న ప్లేయర్ కు 1.7 లక్షల డాలర్లు దక్కుతాయి.

పాక్ కరెన్సీ ప్రకారం ఇది రూ.3 కోట్లు అయినా.. ఇండియన్ కరెన్సీలో రూ.1.3 కోట్లు మాత్రమే. ఈ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ నుంచి ఒక్కో టీమ్ గరిష్ఠంగా ముగ్గురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది.

ఈ కేటగిరీలో బాబర్ ఆజంతోపాటు మరో 18 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ లెక్కన ఎంతటి ప్లేయర్ కు అయినా.. ఇంతకంటే ఎక్కువ మొత్తం దక్కే అవకాశం లేదు. అలాంటి పీఎస్ఎల్ తమ ఐపీఎల్ తో ఎలా పోల్చుకుంటుందని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనం