Virender Sehwag: నేను ఆ ఒక్క బౌలర్‌కే భయపడ్డాను: సెహ్వాగ్
Virender Sehwag: నేను ఆ ఒక్క బౌలర్‌కే భయపడ్డాను అని సెహ్వాగ్ అన్నాడు. డాషింగ్ ఓపెనర్ గా పేరున్న అతడు.. ప్రతి బౌలర్ నూ చీల్చి చెండాడుతూ పరుగులు సాధించాడు.
Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ పేరు చెబితే చాలు ఎలాంటి బౌలర్ అయినా భయపడతాడు. ఎలాంటి ఫుట్‌వర్క్ లేకపోయినా కేవలం హ్యాండ్, ఐ కోఆర్డినేషన్ తో భారీగా పరుగులు సాధించాడు. డాషింగ్ ఓపెనర్ గా పేరుగాంచాడు. టీ20 క్రికెట్ కంటే ముందే టెస్టుల్లోనూ అదే వేగంతో సెంచరీలు బాదిన రికార్డు అతడిది. కానీ అలాంటి సెహ్వాగ్ కూడా ఓ బౌలర్ కు భయపడ్డాడట.
అతడు ఎవరో కాదు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. అతని బౌలింగ్ యాక్షన్ అర్థం కాకపోవడంతో మురళీ బౌలింగ్ లో తాను పరుగులు సాధించడానికి ఇబ్బంది పడినట్లు వీరూ చెప్పాడు. షేన్ వార్న్, షోయబ్ అక్తర్ లేదా ఏ ఇతర బౌలర్ ను ఎదుర్కోవడానికి తానెప్పుడూ భయపడలేదని కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు.
మురళీధరన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి తనకు ఏడేళ్లు పట్టినట్లు చెప్పాడు. "నేను ఔటవుతానని భయపడిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ప్రతి ఒక్కరూ నేను షేన్ వార్న్ లేదా షోయబ్ అక్తర్ లేదా బ్రెట్ లీ లేదా గ్లెన్ మెక్‌గ్రాత్ లకు భయపడతానని అనుకున్నారు.
కానీ వాళ్ల బౌలింగ్ లో ఔటవుతానన్న భయం నాకెప్పుడూ లేదు. వాళ్ల బౌలింగ్ లో నా హెల్మెట్ లేదా శరీరానికి గాయాలవుతాయన్న భయం మాత్రం ఉండేది. మెక్‌గ్రాత్ విషయానికి వస్తే అతని బౌలింగ్ లో పరుగులు చేయలేమని మాత్రం అనిపించేది. కానీ మురళీధరన్ తో మాత్రం నేను భయపడ్డాను.
అతని బౌలింగ్ లో ఎలా పరుగులు చేయాలో నాకు అర్థం కాలేదు. ఔట్ అవుతానని భయపడ్డాను. అతని దూస్రా బాల్ అస్సలు అర్థం అయ్యేది కాదు" అని బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో సెహ్వాగ్ అన్నాడు.
ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్ లో 800 వికెట్లు తీసుకున్నాడు. ఏ ఇతర బౌలర్ కూడా అతని దరిదాపుల్లో కూడా లేరు. మురళీ తర్వాత షేన్ వార్న్ మాత్రమే టెస్టులలో 700కుపైగా వికెట్లు తీసుకున్నాడు. మురళీ బౌలింగ్ యాక్షన్ కూడా మిగతా బౌలర్లకు భిన్నంగా ఉండేది. బంతిని గింగిరాలు తిప్పడంలో అతని తర్వాతే ఎవరైనా.