Muralitharan Remembers Shane Warne: నా కంటే అతడే బెస్ట్ స్పిన్నర్.. వార్న్‌ను గుర్తు చేసుకున్న ముత్తయ్య మురళీధరన్
Muralitharan Praises Shane Warne: శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు. తన కంటే వార్నే మెరుగైన స్పిన్నర్ అని కితాబిచ్చాడు.
Muralitharan remembers Shane Warne: టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరంటే.. తడుముకోకుండా శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరు చెబుతారు. నిజమే దీర్ఘాకాలిక ఫార్మాట్‌లో మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజం, దివంగత షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే.. గణాంకాలను బట్టి మురళీధరన్ పేరు చెబుతారు చాలా మంది. అయితే ముత్తయ్య మురళీధరన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించాడు. తన కంటే షేన్ వార్నే మెరుగైన స్పిన్నర్ స్పష్టం చేశాడు. వార్న్‌ను గుర్తు చేసుకున్న ముత్తయ్య అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
"నా కంటే అతడే(షేన్ వార్న్) మెరుగైన స్పిన్నర్ అని నేను అనుకుంటున్నాం. నేను వార్న్‌ను చూస్తూ ఆడాను. ఎన్నో విషయాలను అతడి నుంచి నేర్చుకున్నాను. మనమందరం అతడిని మిస్ అవుతున్నాం. అతడో లెజెండ్." అని ముత్తయ్య మురళీధరన్.. షేన్ వార్న్‌ను గుర్తు చేసుకున్నాడు.
షేన్ వార్న్.. ఈ ఏడాది ప్రారంభంలో థాయ్‌లాండ్‌లోని ఓ హోటెల్‌లో గుండెపోటుతో మరణించాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన వార్న్.. అనారోగ్యంతో అక్కడే తుదిశ్వాస విడిచాడు. 1992 నుంచి 2007 వరకు తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 708 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం ముత్తయ్య మురళీధరన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం భారత్‌లో ఉన్నాడు. ఇందులో భాగంగా రానున్న టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక స్పిన్నర్ వానిండు హసరంగాతో బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఆస్ట్రేలియాలో పిచ్‌లు ఫింగర్ స్పిన్నర్స్ కంటే కూడా లెగ్ స్పిన్నర్స్‌కు బాగా అనుకూలిస్తాయని పేర్కొన్నాడు.
"హసరంగా టీ20ల్లో మేటీ బౌలర్. గత రెండు, మూడేళ్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాలో పిచ్ కండీషన్లు ఫింగర్ స్పిన్నర్ల కంటే కూడా లెగ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి. కాబట్టి ప్రత్యర్థి బ్యాటర్లకు హసరంగా బౌలంగ్ ఇబ్బందికరంగా ఉండవచ్చు. కాబట్టి అతడితో జాగ్రత్తగా ఉండాలి." అని ముత్తయ్య మురళీధరన్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం