Chris Gayle: గ్రేటెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ని నేనే.. మురళీధరన్‌కు అంత సీన్‌ లేదు: గేల్-chris gayle says he is the greatest off spinner of all time ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Chris Gayle: గ్రేటెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ని నేనే.. మురళీధరన్‌కు అంత సీన్‌ లేదు: గేల్

Chris Gayle: గ్రేటెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ని నేనే.. మురళీధరన్‌కు అంత సీన్‌ లేదు: గేల్

Hari Prasad S HT Telugu
Aug 24, 2022 03:33 PM IST

Chris Gayle: గ్రేటెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ని నేనే అంటున్నాడు వెస్టిండీస్‌ ప్లేయర్‌, యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌. మురళీధరన్‌కు అంత సీన్‌ లేదని కూడా అన్నాడు. ఇంతకీ అతనలా ఎందుకు అన్నాడు?

<p>వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్</p>
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ (AP)

Chris Gayle: తనను తాను యూనివర్స్‌ బాస్‌గా చెప్పుకునే క్రిస్‌ గేల్‌ ఇప్పుడు తానే గ్రేటెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ననీ అంటున్నాడు. వచ్చే నెలతో గేల్‌కు 43 ఏళ్లు నిండుతాయి. కానీ ఇప్పటికీ అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పలేదు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో చివరిసారి వెస్టిండీస్‌కు ఆడిన అతడు.. ఈసారి వరల్డ్‌కప్‌లో ఉంటాడా లేదా అన్నది కూడా తెలియదు.

తాజాగా సిక్ట్సీ (6ixty) అనే కొత్త 60 బాల్‌ ఫ్రాంఛైజీ క్రికెట్‌ టోర్నమెంట్ ఆడటానికి గేల్‌ సిద్ధమవుతున్నాడు. బుధవారం కరీబియన్‌ దీవుల్లో ఈ కొత్త టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఆరు మెన్స్‌, ఆరు వుమెన్స్‌ టీమ్స్‌ తలపడనున్నాయి. టీ20ల్లో గ్రేటెస్ట్‌ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన గేల్‌.. ఈ టోర్నీకి ముందు మాట్లాడుతూ.. తన బౌలింగ్‌ స్కిల్స్‌ గురించీ చెప్పాడు. అసలు తానే గ్రేటెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అని చెప్పుకోవడమూ విశేషం.

"మీకు తెలుసా? నా బౌలింగ్‌ సహజంగా ఉంటుంది. నేను కచ్చితంగా బౌలింగ్‌ చేస్తాను. నేను ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ని. మురళీధరన్ కచ్చితంగా పోటీ పడలేడు. నాకు బెస్ట్ ఎకానమీ రేటు. సునీల్‌ నరైన్‌ నా దరిదాపుల్లోకి కూడా రాడు" అని గేల్‌ అన్నాడు. టీ20ల్లో గేల్‌ ఇప్పటి వరకూ 83 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాడు టీ20ల్లో ఎవరికీ అందనంత ఎత్తులో 14562 రన్స్‌తో ఉన్నాడు.

ఇప్పుడు సిక్ట్సీ టోర్నీతో తిరిగి ఫీల్డ్‌లో అడుగుపెడుతుండటంపై కూడా స్పందించాడు. "మళ్లీ ఫీల్డ్‌లో అడుగుపెడుతుండటం ఉత్సాహంగా ఉంది. ఇన్నాళ్లూ ఇది మిస్సయ్యాను. మళ్లీ ఓ యువకుడిలా తొలి గేమ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంది. దీనికోసం మళ్లీ షేప్‌లోకి రావాలి" అని గేల్‌ అన్నాడు. ఈ సిక్ట్సీ టోర్నీతో ఎన్నో కొత్త ఆవిష్కరణలను కూడా క్రికెట్లోకి తీసుకొస్తున్నట్లు గేల్‌ చెప్పాడు.

మిస్టరీ ఫ్యాన్‌ బాల్‌ అనే ఓ కొత్త కాన్సెప్ట్‌ ఉందని, ఈ బాల్‌కు బ్యాటర్‌ ఔట్‌ కాడని తెలిపాడు. "ఈ రోజుల్లో బౌలర్లు చాలా క్రియేటివ్‌గా ఉన్నారు. బ్యాటర్లకు ఇది సవాలే. చిన్న ఫార్మాట్లు బ్యాటర్లకే అనుకూలించినా.. బౌలర్ల స్కిల్‌ అనేది బ్యాటర్లకు తలనొప్పిగా మారింది. అందుకే బ్యాటర్లకు ఈ టోర్నీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ టోర్నీని ఫ్యాన్స్‌కు మరింత ఆసక్తికరంగా ఎలా మార్చాలన్నది మా చేతుల్లో ఉంది" అని గేల్ అన్నాడు.

Whats_app_banner