Virat Kohli | నా బౌలింగ్‌లో ఆడి ఉంటే.. కోహ్లి అన్ని రన్స్ చేసి ఉండేవాడే కాదు!
ప్రస్తుతం క్రికెట్‌లో విరాట్ కోహ్లిని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. బ్యాట్‌తో అతను పారించిన పరుగుల వరద అలాంటిది. కానీ అలాంటి బ్యాటర్‌కు కూడా సవాలు విసురుతున్నాడు ఈ పాకిస్థాన్ మాజీ బౌలర్.
ముంబై: విరాట్ కోహ్లి గొప్ప బ్యాటరే కావచ్చు కానీ.. తన టైమ్‌లో ఆడి ఉంటే మాత్రం అతను ఇన్ని పరుగులు చేసి ఉండేవాడే కాదని అన్నాడు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్. బుల్లెట్‌లాంటి బాల్స్‌తో తన టైమ్‌లో గొప్పగొప్ప బ్యాట్స్‌మెన్‌కు కూడా చుక్కలు చూపించాడు అక్తర్. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో అతడు ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేకపోయాడు. తాజాగా విరాట్ కోహ్లి ఫామ్‌పై అతడు స్పందించాడు.
"కోహ్లి ఓ మంచి వ్యక్తి. పెద్ద క్రికెటర్. పెద్ద వ్యక్తుల నుంచి పెద్ద మాటలే వస్తాయి. దానికి అతనికి థ్యాంక్స్ చెబుతున్నాను. అయితే కోహ్లి నా బౌలింగ్‌లో ఆడి ఉంటే మాత్రం ఇన్ని రన్స్ చేసి ఉండేవాడు కాదని మాత్రం చెప్పగలను. అతను ఇప్పటి వరకూ చేసిన పరుగులైతే అద్భుతం. వీటి కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. 50 సెంచరీలు చేసి ఉండకపోవచ్చు కానీ 20 లేదా 25 చేశాడు. అవన్నీ మంచి సెంచరీలే" అని అక్తర్ అన్నాడు.
కోహ్లి ఎంతటివాడైనా ఫామ్‌లో లేకపోతే అతన్ని కూడా టీమ్‌లో నుంచి తొలగిస్తారని అక్తర్ స్పష్టం చేశాడు. కోహ్లి ఎలా గాడిలో పడాలో కూడా అతను చెప్పాడు. "అతని మెదడులో ఎన్నో విషయాలు తిరుగుతూ ఉండొచ్చు. అతనో గొప్ప క్రికెటరే కావచ్చు. కానీ అతనికి ఒకటే చెప్పదలచుకున్నారు. ఒకసారి ఒకే విషయంపై ఫోకస్ చెయ్యడంతోపాటు టీవీ, ప్రేక్షకులు అందరినీ వదిలెయ్. నిన్ను నువ్వు ఓ సాధారణ ప్లేయర్‌గా భావించి బ్యాట్ పట్టుకొని ఆడు" అని అక్తర్ సూచించాడు.