Virat Kohli | కెప్టెన్సీ వదిలేశాక చాలా ప్రశాంతంగా ఉంది: కోహ్లీ
కెప్టెన్సీ నుంచి దూరమైన తర్వాత తనకు ఎంతో ప్రశాంతంగా ఉందని విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత ఎలాంటి బాధ్యతలు లేకుండా రిలాక్స్‌గా ఉన్నానని, ఇకపై పూర్తి స్థాయి బ్యాటర్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ ప్రతిభ అసామాన్యం.. అద్వితీయం అని ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. బ్యాటర్‌గానే కాకుండా సారథిగానూ టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించాడు. ఐపీఎల్‌లోనూ తన సత్తా ఏంటో చూపించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న మన రన్నింగ్ మెషిన్ గతేడాది కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-15వ సీజన్ ఆరంభం కానున్న తరుణంలో 9 ఏళ్లలో మొదటి సారిగా కెప్టెన్‌గా కాకుండా బ్యాటర్‌గా బరిలో దిగనున్నాడు. సోమవారం నాడు తన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చేరాడు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
"వావ్..అప్పుడే 15 సంవత్సరాలైంది. ఐపీఎల్‌లో ఇంత దూరం రావడం నమ్మలేక పోతున్నాను. కెప్టెన్సీ బాధ్యతలు, విధులను వదిలేశాక చాలా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం జీవితంలో చాలా మంచి స్థితిలో ఉన్నా. ఇప్పుడు నాకో కుటుంబం, బిడ్డ ఉంది. నా బిడ్డ ఎదుగుదల చూడటం, క్రికెట్ ఆడటం ఈ రెండింటిపైనే నా దృష్టంతా ఉంది. వీటిపై కచ్చితమైన స్పష్టత ఉంది." అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అంతేకాకుండాపూర్తి స్థాయి బ్యాటర్‌గా నూతనొత్తేజంతో రాణించాలనుకుంటున్నానని. చాలా సంవత్సరాల తర్వాత ఎలాంటి బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం దొరికిందని ఆనందం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏం చేయాలో తనకు పూర్తి స్పష్టత ఉందని, జట్టు విజయం కోసం శాయశక్తులా రాణించేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్(2008) నుంచి విరాట్ ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. 2013లో కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన కోహ్లీ.. 2021 వరకు ఆ జట్టును ముందుండి నడిపించాడు. గతేడాది కెప్టెన్సీ తప్పుకున్న మన రన్నింగ్ మిషన్.. ఈ ఏడాది పూర్తి స్థాయి బ్యాటర్‌గా ఆడనున్నాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్‌ను నియమించడంపై కోహ్లీ స్పందించాడు.
"మా జట్టు యాజమాన్యం పక్కా ప్రణాళికతోనే ఐపీఎల్ మెగా వేలంలో డుప్లెసిస్‌ను కొనుగోలు చేసింది. ఎందుకంటే మా జట్టుకు అనుభవమున్న కెప్టెన్ అవసరముంది. టెస్టు సారథిగా అతడికి గొప్ప రికార్డు ఉంది. అలాంటి ఆటగాడు ఆర్సీబీ సారథ్యం వహించడం పట్ల మేమంతా సంతోషంగా ఉంది" అని విరాట్ కోహ్లీ అన్నాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన డుప్లెసిస్ ఈ ఏడాది ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో బెంగళూరు జట్టు అతడిని రూ.7 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్