Cricket-Bollywood | స్పోర్ట్స్‌ స్టార్స్‌పై మనసు పారేసుకున్న బాలీవుడ్‌ భామలు-these are the famous bollywood and cricket couples who got married ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket-bollywood | స్పోర్ట్స్‌ స్టార్స్‌పై మనసు పారేసుకున్న బాలీవుడ్‌ భామలు

Cricket-Bollywood | స్పోర్ట్స్‌ స్టార్స్‌పై మనసు పారేసుకున్న బాలీవుడ్‌ భామలు

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 05:56 PM IST

Cricket-Bollywood.. కొన్ని జంటలు పెళ్లి పీటల వరకూ వెళ్లకపోయినా.. కొన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించి అభిమానులకు కనువిందు చేశాయి. చాలా వరకు బాలీవుడ్‌ నటీమణులు క్రికెటర్లపైనే మనసు పారేసుకున్నా.. లారా దత్తా, కిమ్‌ శర్మలాంటి వాళ్లు మహేష్‌ భూపతి, లియాండర్‌ పేస్‌ వంటి టెన్నిస్ స్టార్లతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

<p>విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట</p>
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట

Cricket-Bollywood.. క్రికెట్‌, బాలీవుడ్.. ఇండియాలో మెజార్టీ ప్రజలకు మంచి కాలక్షేపాన్ని, వినోదాన్ని అందించేవి ఈ రెండే. క్రికెట్‌, బాలీవుడ్‌ కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. అది వెండి తెరపై అయినా కావచ్చు లేదంటే నిజ జీవితంలో అయినా కావచ్చు. తమ అందంతో యువత మతి పోగొట్టే బాలీవుడ్ భామలు.. క్రికెటర్ల ప్రేమలో పడిన సందర్భాల్లో ఎన్నో. ఒకప్పటి పటౌడీ, షర్మిలా ఠాగూర్ జంట నుంచి ఇప్పటి విరాట్‌, అనుష్క జోడీ వరకూ పెళ్లితో ఒక్కటైన క్రికెట్‌, బాలీవుడ్‌ జంటలు హిట్‌ టాక్‌నే కొట్టేశాయి. 

కొన్ని జంటలు పెళ్లి పీటల వరకూ వెళ్లకపోయినా.. కొన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించి అభిమానులకు కనువిందు చేశాయి. చాలా వరకు బాలీవుడ్‌ నటీమణులు క్రికెటర్లపైనే మనసు పారేసుకున్నా.. లారా దత్తా, కిమ్‌ శర్మలాంటి వాళ్లు మహేష్‌ భూపతి, లియాండర్‌ పేస్‌ వంటి టెన్నిస్ స్టార్లతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అలాంటి లవ్‌ కపుల్స్‌ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది.

షర్మిలా ఠాగూర్‌-మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ

ఐదు దశాబ్దాల కిందటి లవ్‌స్టోరీ వీళ్లది. ఒకరు ఇండియన్‌ క్రికెట్‌ టెస్ట్‌ టీమ్‌కు యంగెస్ట్‌ కెప్టెన్‌గా, ఆల్‌టైమ్‌ గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన నవాబ్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ. మరొకరు అలనాటి అందాల నటి షర్మిలా ఠాగూర్‌. ఈ ఇద్దరూ 1969లో పెళ్లి చేసుకున్నారు. 

అంతకు నాలుగేళ్ల ముందు తొలిసారి కలుసుకున్న ఈ ఇద్దరూ బాలీవుడ్‌, క్రికెట్‌ ప్రేమ ప్రయాణాన్ని ప్రారంభించిన తొలి జంటగా నిలిచారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో వీళ్ల పెళ్లిని వ్యతిరేకించిన వాళ్లే ఎక్కువ. అయినా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పిల్లలైన సైఫ్‌ అలీ ఖాన్‌, సోహా అలీ ఖాన్‌ ఇద్దరూ బాలీవుడ్‌ నటులే కావడం విశేషం.

అనుష్క శర్మ- విరాట్‌ కోహ్లి

ఈ మధ్య కాలంలో జరిగిన హైప్రొఫైల్‌ బాలీవుడ్‌, క్రికెట్‌ పెళ్లి వీళ్లదే. 2013లో తొలిసారి ఓ యాడ్‌ షూటింగ్‌లో కలుసుకున్న విరాట్‌, అనుష్క.. తర్వాత నాలుగేళ్ల పాటు డేటింగ్‌ చేసి 2017, డిసెంబర్‌లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2021 ఆరంభంలో వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది.

గీతా బాస్రా- హర్భజన్‌సింగ్‌

ఈ ఇద్దరిదీ 8 ఏళ్లపాటు సాగిన లవ్‌స్టోరీ. 2015 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇండియన్‌ టీమ్‌ చూసిన గ్రేటెస్ట్‌ స్పిన్నర్లలో ఒకడైన హర్భజన్‌ సింగ్‌, బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన గీతా బాస్రా ఆరేళ్లుగా అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

హేజెల్ కీచ్‌-యువరాజ్‌ సింగ్‌

ఫీల్డ్‌లో స్టైలిష్‌ క్రికెటర్‌. ఫీల్డ్‌ బయట లవర్‌ బోయ్‌ ఇమేజ్‌ ఉన్న యువరాజ్‌ సింగ్‌ 2016లో బాలీవుడ్‌ నటి హేజెల్‌ కీచ్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు వీళ్ల లవ్‌ స్టోరీ కూడా ఆరేళ్లపాటు సాగింది.

సాగరికా ఘాట్గే-జహీర్‌ ఖాన్‌

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ బెస్ట్‌ పేస్‌బౌలర్లలో ఒకడైన జహీర్‌ ఖాన్‌.. చక్‌దె ఇండియా మూవీ ఫేమ్‌ సాగరికా ఘాట్గేను 2017లో పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందే ఈ ఇద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్‌ అఫైర్‌ నడిపించారు. ఇద్దరూ కలిసి యువరాజ్‌ సింగ్‌ పెళ్లికి కూడా వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికే తమ మధ్య ఉన్న బంధాన్ని పబ్లిగ్గా చెప్పిన జహీర్‌.. సాగరికను పెళ్లి చేసుకున్నాడు.

నటాషా - హార్దిక్‌ పాండ్యా

ఈ మధ్యే పెళ్లితో ఒక్కటైన మరో బాలీవుడ్‌, క్రికెట్‌ జోడీ నటాషా- హార్దిక్‌ పాండ్యా. జీరో, ఫక్రీ రిటర్న్స్‌, సత్యాగ్రహ వంటి మూవీస్‌తో బాలీవుడ్‌లో పేరు సంపాదించింది నటాషా. ఇటు తన మెరుపు బ్యాటింగ్‌తోపాటు ఆల్‌రౌండర్‌గా టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు హార్దిక్‌ పాండ్యా. ఈ మధ్యే ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది.

లారా దత్తా-మహేష్‌ భూపతి

టెన్నిస్‌ స్టార్‌ మహేష్‌ భూపతిపై మనను పారేసుకుంది మాజీ మిస్‌ యూనివర్స్‌, బాలీవుడ్‌ నటి లారా దత్తా. అంతకుముందు ఇద్దరితో ప్రేమాయణం నడిపించినా.. చివరికి 2011లో భూపతిని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ ఇప్పుడు 9 ఏళ్ల పాప కూడా ఉంది.

నీనా గుప్తా-వివియన్‌ రిచర్డ్స్‌

వెస్టిండీస్‌ లెజెండరీ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, బాలీవుడ్‌ నటి నీనా గుప్తా కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు తప్ప వీళ్ల బంధం పెళ్లి పీటల వరకూ వెళ్లలేదు. అంతకుముందే రిచర్డ్స్‌ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే వివియన్‌ వల్ల నీనా గర్భం దాల్చింది. ఆమెను పెళ్లి చేసుకోకపోయినా.. నీనాతో ఉన్న బంధాన్ని రిచర్డ్స్‌ దాచి పెట్టలేదు. వీళ్లకు మసాబా గుప్తా అనే కూతురు ఉంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఆమె ప్రస్తుతం తల్లి నీనాతో ఉంటోంది.

సంగీతా బిజ్లానీ-మహ్మద్‌ అజారుద్దీన్‌

1990ల్లో క్రికెట్‌, బాలీవుడ్‌ హైప్రొఫైల్‌ వెడ్డింగ్‌ వీళ్లదే. ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌ అయిన అజారుద్దీన్‌ 1985లో తొలిసారి ఓ యాడ్‌ షూట్‌లో సంగీతాను చూసి మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత 11 ఏళ్లకు 1996లో వీళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే 2010లో ఈ జంట విడిపోయింది.

రీనా రాయ్‌-మోసిన్‌ ఖాన్‌

పాకిస్థానీ క్రికెటర్‌ మోసిన్‌ ఖాన్‌ ప్రేమలో పడింది 1990ల్లో బాలీవుడ్‌ను ఏలిన రీనా రాయ్‌. ఈ ఇద్దరూ 1980ల్లో పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్ను సిన్హాతో బ్రేకప్‌ తర్వాత రీనా రాయ్‌ మోసిన్‌ ఖాన్‌ను పెళ్లాడింది. క్రికెటర్‌ అయినా మోసిన్‌ కూడా బాలీవుడ్‌లో సాథీ, బట్వారా వంటి మూవీస్‌లో నటించాడు.

 

Whats_app_banner

సంబంధిత కథనం