Steve Smith: స్మిత్ తెలివి మామూలుగా లేదు.. అంపైర్లనే బోల్తా కొట్టించాడు.. ఏం చేశాడో చూడండి
Steve Smith: స్మిత్ తెలివి మామూలుగా లేదు.. అంపైర్లనే బోల్తా కొట్టించాడు.. ఈ విషయాన్ని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ బయటపెట్టాడు. అతడు నిబంధనల్లోని లోటుపాట్లను తనకు అనుకూలంగా మలచుకున్నాడు.
Steve Smith: ఇండియాలో ఆస్ట్రేలియా టీమ్ ఊహించని విజయం సాధించింది. కమిన్స్ స్థానంలో స్టాండిన్ కెప్టెన్ గా ఉన్న స్మిత్ తన కెప్టెన్సీ మాయాజాలంతో ఇండోర్ టెస్టులో తన టీమ్ ను గెలిపించాడు. తన స్మార్ట్ కెప్టెన్సీతో ఆకట్టుకోవడంతోపాటు తన తెలివితేటలు, నిబంధనల్లో ఉన్న లోటుపాట్లను తనకు అనుకూలంగా మలచుకొని అంపైర్లనే బోల్తా కొట్టించాడు.
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీతో కలిసి స్మిత్ వేసిన ఎత్తుగడ ఫలించింది. టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్.. స్మిత్ ఎత్తుగడలను బయటపెట్టాడు. అతను చెప్పే వరకూ కూడా ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా గమనించలేదు.
అసలు స్మిత్ వేసిన ఎత్తుగడ ఏంటి?
గురువారం ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్ల వెనుక ఉంటూ పదే పదే స్టంపింగ్ అప్పీల్ చేశాడు. అలా చేసినప్పుడల్లా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు అప్పీల్ చేశారు. డీఆర్ఎస్ నిబంధనల్లోని లోటుపాట్లను ఆస్ట్రేలియా టీమ్ తమకు అనుకూలంగా మార్చుకొని.. ఇలా పదే పదే స్టంపింగ్ అప్పీల్స్ ద్వారా రెండు వికెట్లు కూడా పడగొట్టడం గమనార్హం.
స్టంపింగ్ కోసం అప్పీల్ చేసిన సమయంలో థర్డ్ అంపైర్ స్టంపింగ్ తో పాటు ఔట్ సైడ్ ఎడ్జ్ ఏమైనా ఉందా అన్నది కూడా రీప్లేల్లో చూసేవాడు. ఒకవేళ అది స్టంపౌట్ కాకపోయినా.. ఇలా ఔట్ సైడ్ ఎడ్జ్ అని రీప్లేల్లో తేలినా థర్డ్ అంపైర్ ఔట్ ఇస్తాడు. నిజానికి ఔట్ సైడ్ ఎడ్జ్ లను అంపైర్ నాటౌట్ ఇస్తే.. డీఆర్ఎస్ ద్వారా ఆస్ట్రేలియాకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా చేస్తే ఒక్కోసారి రివ్యూలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
అలా కాకుండా స్టంపింగ్ అప్పీల్ చేసి లెగ్ అంపైర్ ను థర్డ్ అంపైర్ కు నివేదించేలా చేస్తే డీఆర్ఎస్ వినియోగించాల్సిన అవసరం ఉండదు. ఇదీ స్మిత్ ఎత్తుగడ. తొలి రోజు ఇలా చేసే అశ్విన్ వికెట్ తీయగలిగారు. నిజానికి ఆస్ట్రేలియా టీమ్, స్మిత్ వేసిన ఈ ఎత్తుగడను మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ బయటపెట్టాడు. క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ.. ఈ లోపాన్ని స్మిత్ తమకు అనుకూలంగా ఎలా మలచుకున్నాడో చెప్పాడు.
"ఈ నిబంధనల్లోని లోపాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నట్లు స్టీవ్ స్మిత్ కు కూడా తెలుసు. స్టంపింగ్ కోసం అప్పీల్ చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ అది నాటౌట్ అని కచ్చితంగా అనుకుంటే థర్డ్ అంపైర్ కు అప్పీల్ చేయకూడదు. అదే సమయంలో స్టంపింగ్ కోసం అప్పీల్ వస్తే థర్డ్ అంపైర్ కేవలం అది మాత్రమే పరిశీలించాలి. ఫీల్డింగ్ కెప్టెన్ రివ్యూ తీసుకుంటే గానీ ఇలాంటి సమయాల్లో క్యాచ్ అనే అంశాన్ని పరిశీలించకూడదు" పార్థివ్ పటేల్ చెప్పాడు.
సంబంధిత కథనం