Pat Cummins ruled out: ఇండియాతో తొలి రెండు టెస్టులు ఓడిన ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వార్నర్, అగార్ లాంటి వాళ్ల సేవలు కోల్పోయిన ఆ టీమ్ కు తాజాగా కెప్టెన్స్ కమిన్స్ కూడా దూరమయ్యాడు. తన తల్లి అనారోగ్యం బారిన పడటంతో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత హుటాహుటిన ఆస్ట్రేలియాకు వెళ్లి కమిన్స్.. మూడో టెస్ట్ కు దూరమయ్యాడు.
నిజానికి ఆ టెస్ట్ ప్రారంభమయ్యే మార్చి 1లోపు అతడు టీమ్ తో చేరాల్సి ఉన్నా.. మరికొద్ది రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. "ఇలాంటి సమయంలో ఇండియాకు రాకూడదని నిర్ణయించుకున్నాను. నా కుటుంబంతో ఉండటమే సరైనదని భావిస్తున్నాను. క్రికెట్ ఆస్ట్రేలియా, నా టీమ్మేట్స్ నుంచి లభించిన మద్దతుకు థ్యాంక్స్. అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు" అని కమిన్స్ అన్నాడు.
మూడో టెస్టుకు దూరమైనా కమిన్స్ కనీసం నాలుగో టెస్టుకైనా తిరిగి వస్తాడని ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ ఆశతో ఉంది. ఒకవేళ కమిన్స్ తల్లి ఆరోగ్యం మెరుగుపడకపోతే చివరి టెస్టుకు కూడా స్మిత్ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత జరగబోయే మూడు వన్డేల సిరీస్ లోనూ ఆస్ట్రేలియాను కమిన్సే లీడ్ చేయాల్సి ఉంది.
నిజానికి రెండో టెస్ట్ ఓటమి తర్వాత స్మిత్ కూడా భార్యతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడ నాలుగు రోజులు గడిపిన తర్వాత గురువారం (ఫిబ్రవరి 23) సాయంత్రం అతడు తిరిగి ఆస్ట్రేలియా టీమ్ తో చేరాడు. ప్రస్తుతం ఆ టీమ్ ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తోంది. వచ్చే బుధవారం (మార్చి 1) మూడో టెస్ట్ ప్రారంభం కానుండగా.. ఆదివారం ఆస్ట్రేలియా టీమ్ ఇండోర్ బయలుదేరనుంది.
స్టీవ్ స్మిత్ ఈ మధ్య కాలంలో కమిన్స్ లేని సమయంలో రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. మొత్తంగా ఇప్పటి వరకూ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 34 టెస్టులు ఆడింది. 2014 నుంచి 2018 మధ్య స్మిత్ ఆస్ట్రేలియాకు పూర్తిస్థాయి కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు వరుస ఓటములు, కీలకమైన ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో మూడో టెస్టులో ఆస్ట్రేలియాను స్మిత్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఈ టూర్ లో అతడు బ్యాట్ తోనూ విఫలమవుతూనే ఉన్నాడు.
సంబంధిత కథనం