Smith stunning catch: స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. చారిత్రక విజయంపై కన్నేసిన ఆస్ట్రేలియా.. వీడియో-smith stunning catch in indore test as australia eye on historic win ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Smith Stunning Catch In Indore Test As Australia Eye On Historic Win

Smith stunning catch: స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. చారిత్రక విజయంపై కన్నేసిన ఆస్ట్రేలియా.. వీడియో

Hari Prasad S HT Telugu
Mar 02, 2023 05:54 PM IST

Smith stunning catch: స్మిత్ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. మరోవైపు ఇండియాపై ఓ చారిత్రక విజయంపై ఆస్ట్రేలియా కన్నేసింది. గెలుపు కోసం ఆ టీమ్ కేవలం 76 పరుగులు చేస్తే చాలు.

పుజారా క్యాచ్ ను కుడివైపుకు డైవ్ చేస్తూ పట్టుకుంటున్న స్టీవ్ స్మిత్
పుజారా క్యాచ్ ను కుడివైపుకు డైవ్ చేస్తూ పట్టుకుంటున్న స్టీవ్ స్మిత్ (AP)

Smith stunning catch: ఇండోర్ టెస్ట్ లో ఇండియాకు ఓటమి తప్పేలా లేదు. మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లోనూ ఇండియన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 163 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ లో 88 పరుగుల ఆధిక్యం ఉండటంతో ఇండియా ఆ టీమ్ ముందు 76 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంచినట్లయింది.

ట్రెండింగ్ వార్తలు

తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ కునెమాన్ 5 వికెట్లతో ఇండియాను కుప్పకూల్చగా.. రెండో ఇన్నింగ్స్ లో సీనియర్ స్పిన్నర్ నేథన్ లయన్ ఏకంగా 8 వికెట్లు తీసుకున్నాడు. ఇండియా ఇన్నింగ్స్ లో పుజారా ఒక్కడే 59 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కఠినమైన పిచ్ పై ఎంతో సహనంతో ఆడిన పుజారా.. 142 బంతులు ఆడి 59 రన్స్ చేశాడు.

ఇండియా ఆ మాత్రం ఆధిక్యమైనా సాధించిందంటే అది పుజారా వల్లే. అతడు శ్రేయస్ అయ్యర్, అశ్విన్ లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ఓవైపు సహచరులంతా పెవిలియన్ కు క్యూ కట్టినా పుజారా మాత్రం అడ్డు గోడలా నిలిచాడు. ఇండియా ఆధిక్యాన్ని కనీసం 100 పరుగులు దాటించడానికి అతడు ప్రయత్నించాడు.

స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్..

అయితే ఆస్ట్రేలియా స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ పుజారా పోరాటాన్ని ముగించింది. అతడు 59 పరుగుల దగ్గర ఉండగా.. లయన్ బౌలింగ్ లో లెగ్ సైడ్ లో ఆడటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో లెగ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్.. కుడివైపు డైవ్ చేస్తూ మెరుపు వేగంతో క్యాచ్ అందుకున్నాడు. పుజారాను ఔట్ చేయడం దాదాపు అసాధ్యంగా కనిపించిన సమయంలో స్మిత్ పట్టిన ఈ క్యాచ్ అతని పోరాటానికి ముగింపు పలికింది.

పుజారా షాట్ కొట్టగానే ఎడమ వైపు కదిలిన స్మిత్.. బంతి కుడి వైపుకు రావడం గమనించి సడెన్ గా ఆ వైపు డైవ్ చేసి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ వికెట్ తో ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకుంది. అంతకుముందే ఓ సిక్స్ కొట్టి స్కోరు వేగాన్ని పెంచడానికి పుజారా ప్రయత్నిస్తున్న సమయంలో స్మిత్ అద్భుతమైన క్యాచ్ తో ఆస్ట్రేలియాకు కీలకమైన వికెట్ సాధించి పెట్టాడు.

WhatsApp channel