South Africa vs Bangladesh: బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా
South Africa vs Bangladesh: బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది సౌతాఫ్రికా టీమ్. గురువారం (అక్టోబర్ 27) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ గ్రూప్ 2 మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఏకంగా 104 రన్స్ తేడాతో గెలిచింది.
South Africa vs Bangladesh: టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లోనే జింబాబ్వేపై ఘన విజయం సాధించేలా కనిపించినా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్‌పై కసిగా ఆడిన సఫారీలు ఏకంగా 104 రన్స్ తేడాతో గెలవడం విశేషం. 206 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 16.3 ఓవర్లలో 101 రన్స్‌కే ఆలౌటైంది.
సౌతాఫ్రికా బౌలర్ నోక్యా బంగ్లా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. రబాడా వేసిన తొలి ఓవర్లోనే సౌమ్య సర్కార్ రెండు సిక్స్‌లు బాదాడు. బంగ్లా టీమ్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 రన్స్ చేసింది. అయితే మూడో ఓవర్‌లో నోక్యా బౌలింగ్‌కు దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అతడు వరుసగా సౌమ్య సర్కార్‌తోపాటు మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్, షకీబుల్ హసన్‌లను పెవిలియన్ చేర్చాడు.
దీంతో 39 రన్స్‌కు 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మళ్లీ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత స్పిన్నర్ షంసి కూడా వికెట్ల వేట మొదలుపెట్టడంతో వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. చివరికి 16. 3 ఓవర్లలో 101 రన్స్‌కే ఆలౌటైంది. నోక్యా 4, షంసి 3 వికెట్లు తీసుకున్నారు. లిటన్ దాస్ మాత్రమే 34 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా గ్రూప్ 2లో టాప్‌లోకి దూసుకెళ్లింది.
సెంచరీ బాదిన రూసో..
అంతకుముందు సౌతాఫ్రికా బ్యాటర్లు రైలీ రూసో, క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రూసో సెంచరీ, డికాక్ హాఫ్ సెంచరీ చేయడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 రన్స్ చేసింది. రూసో 109, డికాక్ 63 రన్స్ చేశారు. తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై వర్షం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరు సఫారీ బ్యాటర్లు కసిగా ఆడినట్లు కనిపించారు.
అయితే సౌతాఫ్రికా మరింత భారీ స్కోరు చేయాల్సి ఉన్నా.. డికాక్ ఔటైన తర్వాత మిగతా బ్యాటర్లు తడబడ్డారు. ఒక దశలో సౌతాఫ్రికా కనీసం 220 పరుగులైనా చేసేలా కనిపించినా.. చివరి ఐదు ఓవర్లలో కేవలం 29 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోవడంతో 205 స్కోరుతో సరిపెట్టుకుంది. స్టబ్స్, మార్‌క్రమ్, మిల్లర్ నిరాశపరిచారు.
వర్షం కారణంగా కాసేపు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే కెప్టెన్ బవుమా (2) ఔటైనా ఆ తర్వాతే అసలు విధ్వంసం ప్రారంభమైంది. అప్పటికే క్రీజులో ఉన్న డికాక్‌తో కలిసిన రూసో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇద్దరూ 5 ఓవర్లలోనే 60 రన్స్ జోడించిన సమయంలో కాసేపు వర్షం అడ్డుపడింది.
ఆ తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభం కాగానే వీళ్లిద్దరూ అదే జోరు కొనసాగించారు. బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ముఖ్యంగా రూసో సిక్స్‌ల మోత మోగించాడు. అతడు కేవలం 52 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ చేసిన తొలి సఫారీ బ్యాటర్‌గా నిలిచాడు. రూసో తన గత టీ20 ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. రూసో ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి.
మరోవైపు జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ చెలరేగిన డికాక్.. 38 బాల్స్‌లోనే 63 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 163 రన్స్ జోడించారు.