Sehwag on Virat Kohli: కోహ్లి కోసం టీమిండియా వరల్డ్ కప్ గెలవాలనుకుంటుంది: సెహ్వాగ్
Sehwag on Virat Kohli: కోహ్లి కోసం టీమిండియా వరల్డ్ కప్ గెలవాలనుకుంటుంది అని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నాడు. 2011లో తాము ఎలాగైతే సచిన్ కోసం అని అనుకున్నామో.. ఇప్పుడు కోహ్లి అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లు చెప్పాడు.
Sehwag on Virat Kohli: ఈసారి వరల్డ్ కప్ ను టీమిండియా విరాట్ కోహ్లి కోసం గెలవాలని అనుకుంటుందని అన్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. నవంబర్ 19న జరగబోయే ఫైనల్లో నరేంద్ర మోదీ స్టేడియంలో కోహ్లి వరల్డ్ ట్రోఫీని ముద్దాడుతుంటే చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు చెప్పాడు. సచిన్ కు ఘనంగా వీడ్కోలు పలకడానికి ధోనీ కెప్టెన్సీలోని తమ టీమ్ ఎలాగైతే సర్వ శక్తులూ ఒడ్డి పోరాడిందో అలాగే ఇప్పుడూ జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
మంగళవారం (జూన్ 27) క్రికెట్ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ రిలీజైన తర్వాత సెహ్వాగ్ స్పందించాడు. ఈ వరల్డ్ కప్ అందుకోవడానికి కోహ్లి అన్ని విధాలుగా అర్హుడని, అతని కీర్తి కిరీటంలో వరల్డ్ కప్ ఓ కలికితురాయిగా మిగిలిపోతుందని అన్నాడు. "ఆ వరల్డ్ కప్ మేము టెండూల్కర్ కోసం ఆడాము.
ఆ వరల్డ్ కప్ గెలిస్తే అది సచిన్ పాజీకి గొప్ప వీడ్కోలు అవుతుంది. ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా అంతే. ప్రతి ఒక్కరూ అతని కోసం వరల్డ్ కప్ గెలవాలని అనుకుంటారు. అతడు ఎప్పుడూ 100 శాతం కంటే ఎక్కువే కష్టపడతాడు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ సెహ్వాగ్ అన్నాడు.
"నాకు తెలిసి విరాట్ కోహ్లి కూడా ఈ వరల్డ్ కప్ కోసం చూస్తున్నాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్ష మంది చూస్తుంటారు. విరాట్ కు పిచ్ లు ఎలా ఉంటాయో తెలుసు. అతడు చాలా పరుగులు చేస్తాడు. ఇండియాకు వరల్డ్ కప్ అందివ్వడానికి తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడు" అని వీరూ స్పష్టం చేశాడు.
ఇండియా 2011లో వరల్డ్ కప్ గెలిచి సచిన్ టెండూల్కర్ కు బహుమతిగా ఇచ్చింది. ఆ జట్టులో విరాట్ కోహ్లి కూడా ఉండటం విశేషం. అప్పటికి అతడు ఇంకా పూర్తిగా జట్టులో నిలదొక్కుకోలేదు. ఇండియా ఆ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమ్ మేట్స్ సచిన్ ను భుజాలపై ఎత్తుకొని వాంఖెడే స్టేడియం మొత్తం తిరిగారు.
ధోనీ కెప్టెన్సీ ఆ వరల్డ్ కప్ తర్వాత ఇండియా ఇప్పటి వరకూ అటు టీ20గానీ, ఇటు వన్డేల్లోగానీ మరో వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2011లోనూ స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు మరోసారి స్వదేశంలోనే వరల్డ్ కప్ జరుగుతుండటంతో ఐసీసీ ట్రోఫీ కరువు తీర్చుకోవడానికి టీమిండియాకు ఇదే మంచి అవకాశం.
సంబంధిత కథనం