Sehwag on Adipurush: ‘బాహుబలి’ని ప్రస్తావిస్తూ ‘ఆదిపురుష్’ గురించి సెహ్వాగ్ ట్వీట్.. ట్రోల్ చేస్తున్న కొందరు నెటిజన్లు
Sehwag on Adipurush: ఆదిపురుష్ మూవీపై సెటైరికల్‍గా ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్. దీంతో కొందరు నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు.
Virender Sehwag on Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటన బాగానే ఉన్నా.. ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్, డైలాగ్స్, కథ పరంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మూవీ గురించి మీమ్స్ కూడా భారీగా వస్తున్నాయి. కొందరు తీవ్ర విమర్శలు సైతం చేశారు. అయితే, ఆదిపురుష్ సినిమా విడుదలై వారం దాటిపోయిన తర్వాత.. టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ స్పందించాడు. ఆదిపురుష్ సినిమా గురించి ట్వీట్ చేశాడు.
ప్రభాస్ బ్లాస్‍బాస్టర్ సినిమా బాహుబలిని ప్రస్తావిస్తూ వీరేందర్ సెహ్వగ్ ఈ ట్వీట్ చేశాడు. “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఆదిపురుష్ చూశాక నాకు అర్థమైంది”అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఆదిపురుష్‍పై వ్యంగంగా జోక్‍లా ఇలా ట్వీట్ పోస్ట్ చేశాడు. అయితే, ఇలాంటి ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొందరు వీరూకు మద్దతు తెలుపుతుంటే.. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరూను కొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఆ స్థాయిలో ఉన్న వీరేందర్ సెహ్వాగ్ ఓ సినిమాపై ఇలాంటి ట్వీట్ చేయడం సరికాదంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఆదిపురుష్‍ను విమర్శించడం ద్వారా అటెన్షన్ పొందాలని వీరూ కూడా అనుకుంటున్నట్టు ఉన్నాడని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇది పాత జోక్ అని.. దాన్ని ఇప్పుడు కాపీ చేశావా సెహ్వాగ్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. పెయిడ్ ట్వీట్ చేసేందుకు చాలా ఆలస్యమైందని మరో యూజర్ రాసుకొచ్చాడు. మరికొందరేమో సెహ్వాగ్‍ను సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఆదిపురుష్ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆదిపురుష్ మూవీ కోసం మనోజ్ ముంతాషిర్ రాసిన కొన్ని డైలాగ్‍పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కొన్నింటిని చిత్రయూనిట్ మార్చింది. ఇక ఆదిపురుష్ చిత్రంలో రావణుడి వేషధారణ, గ్రాఫిక్స్ గురించి కూడా చాలా విమర్శలు వచ్చాయి. పీఎఫ్‍ఎక్స్ గురించి మీమ్స్ కూడా భారీగానే పేలుతున్నాయి. అయితే, చిత్ర యూనిట్ మాత్రం అన్నింటినీ సమర్థించుకుంటోంది.
జూన్ 16వ తేదీన ఆదిపురుష్ సినిమా విడుదలైంది. తొలి మూడు రోజులు కలెక్షన్లు భారీగా రాగా.. రూ.300 కోట్ల మార్క్ దాటింది. అయితే, ఆ తర్వాతి నుంచి కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పటి వరకు రూ.400కోట్లకుపైగా కలెక్షన్లు ఆదిపురుష్ మూవీ సాధించింది. ఒక్క తెలుగు వెర్షనే రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.