Sachin on Girl's Batting Video: క్యా బాత్ హై.. వైరల్ అవుతున్న బాలిక బ్యాటింగ్ వీడియోపై సచిన్ ట్వీట్
Sachin on Girl's Batting Video: క్యా బాత్ హై అంటూ వైరల్ అవుతున్న బాలిక బ్యాటింగ్ వీడియోపై సచిన్ ట్వీట్ చేశాడు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం జరిగిన మరుసటి రోజే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Sachin on Girl's Batting Video: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మీడియా హక్కుల వేలం నుంచి ఫ్రాంఛైజీల కోసం బిడ్డింగ్, ప్లేయర్స్ వేలం వరకూ సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఈ లీగ్ తో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ మరో స్థాయికి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన ప్లేయర్స్ వేలంలో మహిళా క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం దీనికి నిదర్శనం.
అయితే ఆ వేలం జరిగిన మరుసటి రోజే ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ బాలిక బ్యాటింగ్ చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులో ఆమె ప్రతి బంతినీ పర్ఫెక్ట్ టైమింగ్ తో సిక్స్ లుగా మలుస్తూ కనిపించింది. ఈ వీడియో ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నే ఆకర్షించింది. అతడు మంగళవారం (ఫిబ్రవరి 14) ఈ వీడియోను ట్వీట్ చేశాడు.
"నిన్ననే వేలం జరిగింది. ఈ రోజే మ్యాచ్ మొదలైందా? క్యా బాత్ హై. నీ బ్యాటింగ్ ను బాగా ఎంజాయ్ చేశాను" అనే క్యాప్షన్ తో మాస్టర్ ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. సచిన్ ట్వీట్ చేసిన తర్వాత ఈ వీడియో మరింత వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ బాలికను స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తో పోల్చుతున్నారు. అతనిలాగే ఈ బాలిక కూడా 360 డిగ్రీలలో షాట్లు ఆడుతూ కనిపించింది.
ఐపీఎల్ ఎలాగైతే దేశంలోని ప్రతిభను వెలికి తీసి యువ ఆటగాళ్లను కూడా కోటీశ్వరులను చేసిందో.. ఇప్పుడు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా అదే చేస్తుందన్న ఆశతో బీసీసీఐ ఉంది. సోమవారం జరిగిన వేలంలో మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు రూ.59.50 కోట్లు ఖర్చు చేసి 87 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. వీళ్లలో అత్యధికంగా ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా రూ.3.4 కోట్ల ధర పలికింది.
సంబంధిత కథనం