MS Dhoni Career : దినేష్ కార్తీక్ వల్లే ధోనీకి ఛాన్స్.. ఎవరికీ తెలియని సీక్రెట్ ఇది!
MS Dhoni Career : భారత క్రికెట్ జట్టులోకి ధోనీ ఎలా వచ్చాడో కొంత మందికి తెలుసు. అతడి మీద బయోపిక్ కూడా వచ్చింది. అయితే నిజానికి ధోనీ జట్టులోకి ఎలా వచ్చాడో ఎవరికీ తెలియని విషయాలు చెప్పాడు మాజీ క్రికెటర్ సబా కరీమ్.
ఎంఎస్ ధోనీ(MS Dhoni) భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. ఎప్పటికీ గుర్తుండే కెప్టెన్ కూడా. అన్ని ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్. మంచి బ్యాట్స్ మెన్, గొప్ప వికెట్ కీపర్ ధోనీ. అయితే ధోనీ కెరీర్లో రెండు కీలక మలుపులు ఉన్నాయని మాజీ అటగాడు సభా కరీమ్(Saba Karim) చెప్పుకొచ్చాడు. తాను రంజీ టోర్నీ ఆడుతున్నప్పుడు ధోనీని తొలిసారి చూశానని పేర్కొన్నాడు. ధోనీ బౌలింగ్‌కి తాను చాలా ఇంప్రెస్ అయ్యానని, బ్యాటింగ్ లో స్పిన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడని సబా కరీమ్ చెప్పాడు.
'నేను ఎంఎస్ ధోనిని మొదటిసారి చూసింది.. రంజీ ట్రోఫీలో అతని రెండవ సంవత్సరం. బీహార్ తరపున ఆడేవాడు. బ్యాటింగ్ చేయడం, కీపింగ్ చేయడం నేను చూశాను. అతను బ్యాటింగ్ చేసే విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. వికెట్ కీపింగ్‌లో ఉండాల్సిన ఫుట్‌వర్క్ కాస్త లోపించింది. అతనితో కలిసి పనిచేశాం. నేర్పించిన వాటిని ఇప్పటికీ గుర్తుంచుకుంటాడు. దీంతో ఓపెనింగ్ చేసేందుకు అవకాశం కల్పించాం.' అని సబా కరీమ్ అన్నాడు.
వికెట్ కీపర్‌గా ధోనీ కొన్ని తప్పులు చేశాడని సబా కరీమ్ ఎత్తి చూపాడు. కెన్యాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌నే ధోనీ భారత జట్టులోకి తీసుకోవడానికి కారణమని కూడా చెప్పాడు. భారత్ ఎ, పాకిస్థాన్ ఎ, కెన్యా ఎలు పాల్గొన్న సిరీస్‌లో పూర్తిగా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించిన విషయాన్ని సబా కరీమ్ ప్రస్తావించాడు. ఇదే సమయంలో భారత్ తరఫున ఈ సిరీస్‌లో ఆడేందుకు దినేష్ కార్తీక్(Dinesh Karthik) తొలిసారి ఎంపికయ్యాడని చెప్పాడు. భారత జాతీయ జట్టులో పాల్గొనాల్సిందిగా దినేష్ కార్తీక్‌ను ఆహ్వానం రావడంతో ధోనీకి సిరీస్‌లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదని సబా కరీమ్ చెప్పాడు.
ధోనీ కెరీర్‌లో ఇదొక పెద్ద మలుపు అని, ధోనీ ప్రదర్శన గురించి గంగూలీకి చెప్పానని సబా కరీమ్ అన్నాడు. అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీని కలిసిన తర్వాత ధోనీపై ప్రశంసలు కురిపించానని వెల్లడించాడు. అయినప్పటికీ, గంగూలీ అతని ఆటను చూడలేదు. దీంతో 2004లో భారతదేశం పాకిస్తాన్ పర్యటనకు ఎంపిక చేయలేదు. తర్వాత అందరూ ధోనీ ఆటను చూశారని, జట్టులోకి వచ్చాడని వివరించాడు కరీమ్.