Dinesh Karthik | నా పని ఇంకా అయిపోలేదు.. మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ స్పందన-rcb player dinesh karthik reaction after the heroic performance against rajasthan royals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rcb Player Dinesh Karthik Reaction After The Heroic Performance Against Rajasthan Royals

Dinesh Karthik | నా పని ఇంకా అయిపోలేదు.. మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ స్పందన

Maragani Govardhan HT Telugu
Apr 06, 2022 08:34 AM IST

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లో 44 పరుగులు చేసిన ఈ బ్యాటర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

దినేశ్ కార్తీక్
దినేశ్ కార్తీక్ (PTI)

ముంబయి వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో(Rajasthan Royals) మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీని గుర్తుకు తెస్తూ దినేశ్ కార్తీక్(Dinesh Karthik)హీరోయిక్ పర్ఫార్మెన్స్‌తో బెంగళూరు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 23 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో హీరోయిక్ ప్రదర్శన చేసిన దినేశ్ కార్తీక్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. తన పని ఇంకా అయిపోలేదని స్పష్టం చేశాడు.

మ్యాచ్ కోసం నా వంతు ప్రయత్నం నిజాయితీగా చేశాను. గత కొన్నేళ్లుగా నేను మరింత మెరుగ్గా రాణిస్తున్నానని అనుకుంటున్నా. నా ట్రైనింగ్ భిన్నంగ్ ఉంది. నేను ఇంకా పూర్తి చేయాల్సింది చాలా ఉందని అనుకుంటున్నా. నాకు ఓ లక్ష్యం ఉంది. దాన్ని సాధించాలనుకుంటున్నాను. అని దినేశ్ కార్తీక్ మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి స్పందనను తెలియజేశాడు.

ఆర్సీబీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లక్ష్యాన్ని ఎలాగైన ఛేదించాలని దినేశ్ కార్తీక్ ప్రణాళికకు వ్యూహరచన చేశాడు. "మాకు ఓవర్‌కు 12 పరుగులు కావాలి. కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలో గుర్తించాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని గేమ్‌లో ఏం కావాలో తెలుసుకోవాలి." అని దినేశ్ కార్తీక్ తెలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2022 సీజన్ కోసం చాలా బాగా సన్నద్ధమయ్యానని స్పష్టం చేశాడు.

"మీరు శ్రమించిన గంటలు ఎవరికీ కనిపించవు. ఆ కష్టానికి నిజమైన ప్రతిఫలం తర్వాత కనిపిస్తుంది. ఇదే నేను నమ్ముతాను. మీరు టీ20ల్లో ముందస్తుగానే ఆలోచించాలి. లేదంటే అప్పటికప్పుడు షాట్ మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి." అని తెలిపాడు. ఐపీఎల్ మెగావేలంలో దినేశ్ కార్తీక్‌ను బెంగళూరు జట్టును కొనుగోలు చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ తానేంటో నిరూపించుకున్నాడు దినేశ్ కార్తీక్.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ శుభారంభాన్ని అందుకున్నప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఇరుక్కుంది. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. సహచర ఆటగాడు షాబాజ్ అహ్మద్‌తో(26 బంతుల్లో 45) కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 12 బంతుల్లో 15 పరుగుల చేయాల్సిన సమయంలో రెండు ఫోర్లు బాది మ్యాచ్‌ను రాజస్థాన్ నుంచి లాగేసుకున్నాడు. చివరి ఓవర్‌లో మూడు పరుగులు కావాల్సి ఉండగా.. హర్షల్ పటేల్ అద్భుతమైన సిక్సర్‌ కొట్టడంతో బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్