Ravi Shastri on Pujara: గిల్ నేర్చుకుంటాడేమోగానీ పుజారాకు ఏమైంది: రవిశాస్త్రి అసహనం-ravi shastri on pujara says not knowing where his off stump disappointing ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Pujara: గిల్ నేర్చుకుంటాడేమోగానీ పుజారాకు ఏమైంది: రవిశాస్త్రి అసహనం

Ravi Shastri on Pujara: గిల్ నేర్చుకుంటాడేమోగానీ పుజారాకు ఏమైంది: రవిశాస్త్రి అసహనం

Hari Prasad S HT Telugu
Jun 09, 2023 08:16 AM IST

Ravi Shastri on Pujara: గిల్ నేర్చుకుంటాడేమోగానీ పుజారాకు ఏమైంది అంటూ రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో ఈ సీనియర్ బ్యాటర్ ఔటైన తీరుపై శాస్త్రి సీరియస్ అయ్యాడు.

రవిశాస్త్రి, పుజారా
రవిశాస్త్రి, పుజారా (Twitter/Getty)

Ravi Shastri on Pujara: టీమిండియా తీరు మారలేదు. గత డబ్ల్యూటీసీ ఫైనల్ లాగే ఈ మ్యాచ్ కూడా కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కాగా.. రెండో రోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి 151 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన ఇండియన్ టీమ్.. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ ఫైనల్లో గట్టెక్కడం అంత సులువుగా కనిపించడం లేదు. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇండియన్ బ్యాటర్లు ఔటైన తీరుపై మాజీ కోచ్ రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.

ముఖ్యంగా పుజారా.. గ్రీన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవడంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గిల్ లాంటి యువ బ్యాటర్ నేర్చుకుంటాడేమోగానీ పుజారాకు ఏమైంది అని శాస్త్రి ప్రశ్నించాడు. ఇంత సీనియర్ బ్యాటర్ కు తన ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో కూడా తెలియదా అని అన్నాడు. ఆ బంతి ఆడటంతో పుజారా ఏ తప్పిదం చేశాడో వివరించాడు.

"ఫ్రంట్ ఫుట్ సరిగా వాడకుండా బంతిని అలా వదిలేయడం దారుణం. ఫ్రంట్ ఫుట్ బంతి వైపు వెళ్లాల్సింది. ముందు ఆడాలని అనుకున్నాడు. తర్వాత వదిలేశాడు. ఆ బాల్ ను వదిలేసే సమయంలో ఆఫ్ స్టంప్ ఎక్స్‌పోజ్ అయింది. ఫ్రంట్ ఫుట్ ఆఫ్ స్టంప్ వెళ్లాల్సిన సమయంలో ఇంకా మిడిల్ స్టంప్ దగ్గరే ఉంది. ఆ ఫ్రంట్ ఫుట్ చూడండి. అది మరింత ముందుకు, బాల్ వైపు ఉండాల్సింది. అది ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉందని అనుకున్నాడు. తప్పుగా అంచనా వేశాడు" అని కామెంటరీ సందర్బంగా శాస్త్రి అన్నాడు.

నిజానికి ఇదే పిచ్ పై రెండేళ్ల కిందట సర్రే జట్టుకు ఆడుతూ పుజారా టన్నుల కొద్దీ రన్స్ చేశాడు. గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టెస్టులోనూ ఆ అనుభవంతోనే పుజారా ఆడాడు. అయినా అప్పుడూ విఫలమయ్యాడు. ఇప్పుడు కూడా నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో గిల్ కూడా తప్పిదం చేసినా.. యువకుడైన అతడు నేర్చుకుంటాడని, పుజారా మాత్రం నిరాశ పరిచాడని శాస్త్రి స్పష్టం చేశాడు.

"ఇంగ్లండ్ లో బంతిని వదిలేయడం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అదే సమయంలో ఆఫ్ స్టంప్ ఎక్కడుందో కూడా తెలియాలి. ఇక్కడ పుజారాకు తన ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో తెలియలేదు. శుభ్‌మన్ గిల్ తన ఫుట్ వర్క్ విషయంలో కాస్త బద్ధకంగా కనిపించాడు. కానీ అతడు యువకుడు. నేర్చుకుంటాడు. కానీ పుజారా అలా చేయడం నిరాశ కలిగించింది. అందుకే ప్రతిసారీ చెప్పేది.. మీ ఆఫ్ స్టంప్ ఎక్కడుందో చూసుకోమని" అని శాస్త్రి అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం