WTC Final: టాప్ ఆర్డర్ ఢమాల్.. సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. ఇక అతడిపైనే భారం!-team india in deep trouble after top order fails in batting in wtc final against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: టాప్ ఆర్డర్ ఢమాల్.. సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. ఇక అతడిపైనే భారం!

WTC Final: టాప్ ఆర్డర్ ఢమాల్.. సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. ఇక అతడిపైనే భారం!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 08, 2023 11:51 PM IST

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టీమిండియా వెనుకంజలోనే కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‍లోనూ విఫలమైంది.

ఔటయ్యాక పెవిలియన్ బాట పట్టిన విరాట్ కోహ్లీ
ఔటయ్యాక పెవిలియన్ బాట పట్టిన విరాట్ కోహ్లీ (AP)

WTC Final Second Day: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍లో టీమిండియా తడబాటు కొనసాగింది. లండన్‍లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ తుదిపోరులో రోహిత్‍సేన కష్టాలు గురువారం రెండో రోజు కూడా కంటిన్యూ అయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, రెండో రోజును ముగించింది. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో అజింక్య రహానే (29 నాటౌట్), తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ (5 నాటౌట్) ఉన్నారు. టాప్ ఆర్డర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‍మన్ గిల్ (13), చతేశ్వర్ పుజార (14), విరాట్ కోహ్లీ (14) విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (48) రాణించటంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక టీమిండియాను గట్టెక్కించే భారమంతా సీనియర్ రహానేపైనే ఉంది. అంతకు ముందు రెండో సెషన్‍లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. వివరాలివే.

టాపార్డర్ వెనువెంటనే..

ఆస్ట్రేలియా ఆలౌటయ్యక రెండో సెషన్‍లోనే భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. కాసేపు ఆచితూచి ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బౌలింగ్‍లో ఆరో ఓవర్‌లో ఎల్‍బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మంచి టచ్‍లో కనిపించిన శుభ్‍మన్ గిల్‍ను ఆ తర్వాతి ఓవర్లోనే ఆసీస్ పేసర్ స్కాట్ బోల్యాండ్ బౌల్డ్ చేశాడు. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాను ఆసీస్ యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ బోల్తా కొట్టించి బౌల్డ్ చేశాడు. రన్‍మెషిన్ విరాట్ కోహ్లీ కాన్ఫిడెంట్‍గానే కనిపించినా.. ఎక్కువసేపు నిలువలేకపోయాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగ్‍లో స్లిప్‍లో స్మిత్‍కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. టీమిండియా టాప్-4లో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా 20 పరుగులు చేయలేకపోయారు. దీంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో కూరుకుంది.

ఆదుకున్న జడేజా, రహానే

భారత టాప్ ఆర్డర్ విఫలం కాగా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (29 నాటౌట్) నిలకడ ప్రదర్శించారు. ఓవైపు జడేజా దూకుడుగా కౌంటర్ అటాక్ చేస్తే.. రహానే మాత్రం ఓపిగ్గా కొనసాగాడు. అయితే, జడేజాను ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఔట్ చేశాడు. దీంతో 71 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎస్ భరత్ ఆచితూచి ఆడాడు. మూడో రోజు ఆటను రహానే, భరత్ ప్రారంభించనున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇండియా ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా మళ్లీ ఆధిపత్యం చెలాయించాలంటే మూడో రోజు రహానే అదరగొట్టాలి. అతడికి మరో ఎండ్ నుంచి మద్దతు లభించాలి. ఇక, టీమిండియాను గట్టెక్కించే భారం ఇప్పుడు రహానేపైనే ఉంది.

అంతకు ముందు ఆస్ట్రేలియా 469 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. 327/3 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజులో అడుగుపెట్టిన ఆ టీమ్.. మరో 142 పరుగులు జత చేయగలిగింది. భారత బౌలర్లు రెండో రోజు 36 ఓవర్లలోనే ఏడు వికెట్లు పడగొట్టి ఆసీస్‍ను కట్టడి చేశారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలతో చెలరేగారు. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం