Ravi Shastri furious over Dhoni: ధోనీ తీరుపై రవిశాస్త్రి తీవ్రంగా మండిపడ్డాడు.. ఆ ఓటమి జీర్ణించుకోలేకపోయాడు
Ravi Shastri furious over Dhoni: ధోనీ తీరుపై రవిశాస్త్రి చాలా సీరియస్ అయ్యాడని, ఆ మ్యాచ్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ చెప్పాడు. టీమ్ కు సంబంధించిన మరో డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ ను తన తాజా బుక్ లో బయటపెట్టాడు.
Ravi Shastri furious over Dhoni: టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తన తాజా బుక్ "కోచింగ్ బియాండ్: మై డేస్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్"లో సంచలన విషయాలు రాశాడు. ఇందులో ఇప్పటి వరకూ క్రికెట్ ఫ్యాన్స్ వినని ఎన్నో ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి. అందులో మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై అప్పటి కోచ్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడన్నది కూడా ఒకటి.
2018లో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని శ్రీధర్ చెప్పాడు. తొలి వన్డేలో 8 వికెట్లతో ఇండియా గెలిచినా.. తర్వాతి మ్యాచ్ లో 86 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ధోనీ కనీసం ఫైట్ చేయకుండానే చేతులెత్తేసిన తీరు కోచ్ రవిశాస్త్రిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్లు శ్రీధర్ చెప్పాడు. ఆ మ్యాచ్ లో కోహ్లి, రైనా క్రీజులో ఉన్నంత వరకూ ఆశలు ఉన్నా.. తర్వాత వెంటవెంటనే ఈ ఇద్దరితోపాటు హార్దిక్ కూడా ఔటయ్యాడు.
ఈ సమయంలో 66 బంతుల్లో 133 రన్స్ చేయాల్సి వచ్చింది. టెయిలెండర్లతో కలిసి ధోనీ క్రీజులో ఉన్నాడు. అయితే అతడు మాత్రం విజయం కోసం ఏమాత్రం ప్రయత్నించకుండా నింపాదిగా ఆడాడు. ఆ ఇన్నింగ్స్ లోనే ధోనీ వన్డేల్లో 10 వేల రన్స్ కూడా చేశాడు. అయితే చివరికి అతడు 59 బంతుల్లో కేవలం 37 రన్స్ చేసి 47వ ఓవర్లో ఔటయ్యాడు. ఇదే రవిశాస్త్రికి ఆగ్రహం తెప్పించినట్లు శ్రీధర్ వెల్లడించాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో నేరుగా ధోనీ పేరు చెప్పకుండా రవి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా వివరించాడు.
"రవి చాలా అసహనంగా కనిపించాడు. 86 రన్స్ తో ఓడిపోయినందుకు కాదు కానీ.. కనీసం పోరాడకుండానే చేతులెత్తేయడం అతనికి నచ్చలేదు. అందుకే మూడో వన్డేకు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో మీటింగ్ పెట్టాడు. అప్పుడు నేరుగా ధోనీ కళ్లలోకి చూస్తూ రవి ఇలా చెప్పాడు. మీరు ఎవరైనా సరే.. గెలవడానికి ప్రయత్నించకుండా మరో మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి మళ్లీ రాకూడదు.
నా కోచింగ్ లో ఇలాంటిది జరగకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే మాత్రం అతనికి అదే చివరి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ ఓడిపోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. కానీ ఇలా మాత్రం ఓడకూడదు" అని రవిశాస్త్రి అన్నట్లు శ్రీధర్ తన బుక్ లో తెలిపాడు.
"ఆ సమయంలో ధోనీ.. రవిశాస్త్రి ముందే కూర్చున్నాడు. అతడు టీమ్ కోసం ఈ విషయాన్ని చెప్పినా.. కళ్లు మాత్రం మొత్తం ధోనీపైనే ఉన్నాయి. ధోనీ కూడా కామ్ గా ఉంటూ రవి కళ్లలోకి చూస్తూనే కనిపించాడు" అని కూడా శ్రీధర్ వెల్లడించాడు.
సంబంధిత కథనం
టాపిక్