Pro Kabaddi League Season 10: కూత మొదలు.. తొలి పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి-pro kabaddi league season 10 started gujarat giants beat telugu titans in inaugural match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pro Kabaddi League Season 10: కూత మొదలు.. తొలి పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి

Pro Kabaddi League Season 10: కూత మొదలు.. తొలి పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 02, 2023 10:55 PM IST

Pro Kabaddi League (PKL) Season 10: ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ తొలి పోరులో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది. ఉత్కంఠ పోరులో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. మరో మ్యాచ్‍లో యూ ముంబా గెలిచింది.

Pro Kabaddi League Season 10: కూత మొదలు.. తొలి పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి
Pro Kabaddi League Season 10: కూత మొదలు.. తొలి పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి (PTI)

Pro Kabaddi League (PKL) Season 10: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 10వ సీజన్‍లో కూత షురూ అయింది. ఈ సీజన్ నేడు (డిసెంబర్ 2) మొదలైంది. అహ్మదాబాద్‍లోని ఈకేఏ ఎరీనాలో నేడు తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో గుజరాత్ జెయింట్స్ 38-32 తేడాతో తెలుగు టైటాన్స్ టీమ్‍పై విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన తెలుగు జట్టు కాస్తలో పరాజయం పాలైంది.

గుజరాత్ జెయింట్స్ ప్లేయర్ సోనూ జగ్లాన్ 11 పాయింట్లతో సూపర్-10తో ఈ మ్యాచ్‍లో సత్తాచాటాడు. రాకేశ్ సుగ్రోయా, సంజీవ్ చెరో 5 పాయింట్లు చేశారు. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 11 పాయింట్ల సాధించి సూపర్ 10 పర్ఫార్మెన్స్ చేశాడు. రజ్నీశ్ దలాల్, సంజీవి ఎస్ కూడా కూడా 5 తలా ఐదు పాయింట్లతో రాణించారు. అయితే, రెండో హాఫ్‍లో తడబడిన టైటాన్స్ జట్టుకు పరాజయం తప్పలేదు.

ఈ మ్యాచ్‍లో తెలుగు టైటాన్స్ ఆరంభంలో ఆధిపత్యం చూపింది. అయితే, ఆ తర్వాత పుంజుకున్న గుజరాత్ 7వ నిమిషంలో స్కోర్లను 7-7తో సమం చేసింది. ఆ తర్వాత టైటాన్స్ ఆటగాళ్లు కాస్త ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. అయితే, కాసేపటికే తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ దూకుడు పెంచారు. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి 16-13తో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచింది.

అయితే, రెండో హాఫ్‍లో గుజరాత్ జెయింట్స్ పుంజుకుంది. సోనూ ఐదు పాయింట్ల రైడ్‍తో దూకుడు చూపింది. ఓ దశలో టైటాన్స్ జట్టును ఆలౌట్ చేసిన గుజరాత్ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. దాన్నే కొనసాగిస్తూ 27వ నిమిషంలో 30-23తో జెయింట్స్ దూసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే రాబిన్ చౌదరి చేసిన మంచి రైడ్‍తో టైటాన్స్ తిరిగి పోటీలోకి వచ్చింది. అయితే, చివర్లో దూకుడు పెంచిన గుజరాత్ ఎట్టకేలకు గెలిచింది.

నేడే (డిసెంబర్ 2) జరిగిన మరో మ్యాచ్‍లో యు ముంబా జట్టు 34 - 31 తేడాతో యూపీ యోధాస్‍పై గెలిచింది. యు ముంబా ప్లేయర్ అమీర్ మహమ్మద్ జఫర్దనేష్ 12 పాయింట్లతో అదరగొట్టాడు.

Whats_app_banner