WTC Final Rohit Sharma: మా ఓటమికి కారణం అదే: భారత కెప్టెన్ రోహిత్ శర్మ
WTC Final Rohit Sharma: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి గురించి మాట్లాడాడు రోహిత్ శర్మ. పరాయజం పాలయ్యేందుకు కారణాలను వివరించాడు.
WTC Final Rohit Sharma: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍లో టీమిండియా ఓటమి పాలైంది. లండన్‍లోని ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‍లో నేడు (జూన్ 11) ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో పరాయజం చెందింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఐదో రోజైన నేడు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 234 పరుగులకే ఆలౌటైంది. దీంతో డబ్ల్యూటీసీ టైటిల్ ఆస్ట్రేలియా కైవసం అయింది. ఐదో రోజు ఆటలో 70 పరుగులకే మిగిలిన 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి సెషన్‍లోనే ఆలౌటైంది. 444 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క భారత బ్యాట్స్‌మెన్ కూడా అర్ధశతకం చేయలేకపోయారు. కాగా, ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ఓటమికి కారణాలేమిటో పేర్కొన్నాడు.
పిచ్ బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉన్నా ఉపయోగించుకోలేక పోయామని, తమ జట్టు ఓటమికి ఇదే ప్రధాన కారణమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాక తొలి సెషన్‍లో బాగా బౌలింగ్ చేశామని, అయితే ఆ తర్వాత బౌలింగ్ కూడా నిరాశపరిచిందని అన్నాడు. అయితే, ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అద్బుతంగా ఆడాడని హిట్‍మ్యాన్ అన్నాడు.
“టాస్ గెలిచిన తర్వాత మేం బాగా స్టార్ట్ చేశామని అనుకున్నాం. ఫస్ట్ సెషన్‍లో బాగా బౌలింగ్ చేశాం. ఆ తర్వాత మేం చేసిన బౌలింగ్ విధానంతో మేమే నిరాశలోకి వెళ్లిపోయాం. ఆస్ట్రేలియా బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలి. ట్రావిస్ హెడ్.. స్టీవ్ స్మిత్‍తో కలిసి చాలా బాగా ఆడాడు. అప్పుడు మాకు మ్యాచ్ కాస్త దూరమైంది. కమ్ బ్యాక్ చేయడం కష్టమేనని మాకు తెలుసు. కానీ మేం ఆ తర్వాత మంచి ప్రదర్శన చేశాం. చివరి వరకు పోరాడాం” అని రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్ సహకరించినా బ్యాటింగ్‍లో విఫలమయ్యామని అన్నాడు.
“150 పరుగులలోపే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో (తొలి ఇన్నింగ్స్) రహానే, శార్దూల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా బాగా చేశాం. మళ్లీ బ్యాటింగ్‍లో రాణించలేకపోయాం. బ్యాటింగ్ చేసేందుకు పిచ్ బాగుంది. ఐదు రోజులు పిచ్ అనుకూలంగానే ఉంది. కానీ మేం ఉపయోగించుకోలేకపోయాం. గత నాలుగేళ్లలో రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాం. ఇందుకోసం చాలా కష్టపడ్డాం. కానీ మాకు ఇది నిరాశే. ఇంకో మ్యాచ్ మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. ఇది మంచి ప్రయత్నమే. తదుపరి చాంపియన్‌షిప్ కోసం మేం మళ్లీ పోరాడతాం” అని రోహిత్ శర్మ చెప్పాడు.
కాగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా కనీసం అర్ధశతకం కూడా చేయలేదు. విరాట్ కోహ్లీ (49), అజింక్య రహానే (46) ఆశలు రేపినా.. ఎక్కువ సేపు నిలువలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో రహానే (89), శార్దూల్ ఠాకూర్ (51), రవీంద్ర జడేజా (48) మాత్రమే రాణించారు. మొత్తంగా డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఏకంగా 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది భారత జట్టు.
సంబంధిత కథనం