IPL: వాళ్లు చెప్పిందే వేదం కదా మరి..: షాహిద్ అఫ్రిది
IPLపై స్పందించాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. ఈ మెగా లీగ్‌కు ఇచ్చే విండో మరికాస్తా పెరగనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా చేసిన కామెంట్స్‌పై అఫ్రిది మాట్లాడాడు.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే క్రికెట్ దశ, దిశను మార్చింది. ఈ లీగ్‌ను చూసి చాలా దేశాల్లో ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినా.. అవేవీ ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ మధ్యే ఐపీఎల్ మీడియా హక్కులు కనీవినీ ఎరగని రీతిలో రూ.48,390 కోట్లకు అమ్ముడయ్యాయి. బీసీసీఐతోపాటు క్రికెటర్లు, రాష్ట్రాల అసోసియేషన్లపై కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్‌ను మరింత విస్తృతం చేయాలని బోర్డు ఆలోచిస్తోంది.
ఈ ఏడాది పది టీమ్స్ కావడంతో 74 మ్యాచ్‌లు జరగగా.. వీటిని భవిష్యత్తులో మరింత పెంచుతామని బోర్డు సెక్రటరీ జే షా చెప్పారు. మీడియా హక్కుల ఈ-వేలం తర్వాత షా మాట్లాడారు. "ఐపీఎల్ వల్ల క్రికెటర్లే కాదు కొంతమంది లెజెండ్స్ కోచ్‌లుగా కూడా మారుతున్నారు. ఐపీఎల్ ఓ అద్భుతమైన వేదిక. అందుకే భవిష్యత్తులో మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతాం" అని షా స్పష్టం చేశారు.
దీనిపై తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. ఐపీఎల్ విండో పెరిగితే.. దానికి ఐసీసీతోపాటు మిగతా బోర్డులు కూడా తమ ప్లేయర్స్‌కు అనుమతి ఇస్తే.. అది పాకిస్థాన్ క్రికెట్‌పై ప్రభావం చూపుతుంది. ఆ టీమ్ ప్లేయర్స్ ఈ లీగ్‌లో ఆడటానికి లేదు. అది జరిగే సమయంలో పాక్‌తో ఆడటానికి ఏ టీమ్సూ ఉండవు. దీనిపై సమా టీవీతో మాట్లాడుతూ అఫ్రిది స్పందించాడు.
"చివరికి మార్కెట్, ఎకానమీదే పైచేయి అవుతుంది. క్రికెట్‌కు అతిపెద్ద మార్కెట్ ఇండియానే. అందువల్ల వాళ్లు ఏం చెబితే అదే జరుగుతుంది" అని అఫ్రిది అనడం గమనార్హం. ఐపీఎల్‌లాగే పాక్‌లోనూ పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా లీగ్‌తో పోలిస్తే.. పీఎస్‌ఎల్ పదో వంతు కూడా లేదు. అక్కడ ప్లేయర్స్‌కు లభించే మొత్తం కూడా చాలా చాలా తక్కువ.
సంబంధిత కథనం
టాపిక్