Pakistan Cricket Team: పాకిస్థాన్ టీమ్ వస్తుందా రాదా.. దానికీ నో చెప్పిన ఐసీసీ
Pakistan Cricket Team: పాకిస్థాన్ టీమ్ వస్తుందా రాదా? ఆ టీమ్ వరల్డ్ కప్ లో ఆడుతుందా లేదా? దీనికి ఇప్పటి వరకైతే స్పష్టమైన సమాధానం లేదు. వేదికలు మార్చాలన్న పీసీబీ వినతిని కూడా ఐసీసీ తోసిపుచ్చింది.
Pakistan Cricket Team: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ మంగళవారం (జూన్ 27) రిలీజైన సంగతి తెలుసు కదా. ఇందులో పాకిస్థాన్ ఆడబోయే మ్యాచ్ ల వివరాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఆ టీమ్ లీగ్ స్టేజ్ లో ఎక్కడెక్కడ మ్యాచ్ లు ఆడనుందో కూడా ఆ షెడ్యూల్లో ఉంది. హైదరాబాద్ లోనే ఆ టీమ్ రెండు లీగ్ మ్యాచ్ లు ఆడనుండటం విశేషం.
ఇక ఇండియాతో అహ్మదాబాద్ లో.. ఆఫ్ఘనిస్థాన్ తో చెన్నైలో ఆడబోమని.. ఆ వేదికలు మార్చాలన్న పాక్ బోర్డు వినతిని కూడా ఐసీసీ, బీసీసీఐ తోసిపుచ్చాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ లో ఇండియాతో మ్యాచ్ ను పాక్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీని వెనుక రాజకీయ ఎజెండా ఉందని కూడా ఆరోపించింది. అయితే ఐసీసీ, బీసీసీఐ వెనక్కి తగ్గలేదు.
పాక్ టీమ్ వస్తుందా లేదా?
మరి వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వస్తుందా లేదా? దీనిపై ఇప్పటి వరకూ స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. అయితే ఇండియాకు రావాలంటే మొదట తాము పాక్ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని పీసీబీ అధికార ప్రతినిధి చెప్పడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వంతో ఈ విషయంపై చర్చిస్తున్నామని, వాళ్ల నుంచి ఏదైనా సమాధానం వస్తే వెంటనే ఐసీసీకి చెబుతామని ఆ ప్రతినిధి చెప్పారు.
అయితే వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ టీమ్ కచ్చితంగా ఇండియాకు వస్తుందని ఇటు బీసీసీఐ, అటు ఐసీసీ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇండియాతో మ్యాచ్ ను అహ్మదాబాద్ లో కాకుండా చెన్నై లేదా బెంగళూరులో నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఇక ఆఫ్ఘనిస్థాన్ తో చెన్నైలో జరగాల్సిన మ్యాచ్ ను బెంగళూరుకు.. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్ ను చెన్నైకి మార్చాలని కూడా కోరింది.
అయితే పీసీబీ వినతిని ఐసీసీ పట్టించుకోలేదు. అయినా సరే ఇప్పటికే టోర్నీలో ఆడతామని పాక్ బోర్డు ఒప్పందంపై సంతం చేసిందని, వాళ్లు కచ్చితంగా ఆ మాటకు కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు ఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆసియా కప్ విషయంలోనే బీసీసీఐ, పీసీబీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం