No Beers in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ స్టేడియాల్లోకి బీర్లకు నో ఎంట్రీ
No Beers in FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ స్టేడియాల్లోకి బీర్లకు నో ఎంట్రీ అని ఆతిథ్య ఖతార్ స్పష్టం చేసింది. ఇది వరల్డ్ కప్ ఆర్గనైజర్లకు షాక్‌లాంటిదే. మొదట సరే అని ఇప్పుడు నో చెబుతుండటం వాళ్లకు మింగుడు పడటం లేదు.
No Beers in FIFA World Cup: బీర్లు తాగుతూ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడటం చాలా సాధారణం. అయితే ఇప్పుడు వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న ఖతార్ పరిస్థితి వేరు. ఇదొక ఇస్లామిక్ దేశం. ఇక్కడ పబ్లిగ్గా ఆల్కహాల్ తాగడం నిషేధం. కానీ ఫుల్‌బాల్ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు పొందే సమయంలో ఫిఫా వాణిజ్య ఒప్పందాలను గౌరవిస్తామని ఖతార్ అంగీకరించింది.
బీర్లు తయారు చేసే సంస్థ అయిన బడ్‌వైజర్‌తో ఫిఫాకు ఎన్నో ఏళ్లుగా ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా వరల్డ్‌కప్ సమయంలో స్టేడియాల దగ్గర బడ్‌వైజర్ బీర్లు అమ్ముతుంటారు. స్టేడియాల్లోనే ఫ్యాన్స్ బీర్లు తాగుతూ మ్యాచ్‌లు చూస్తుంటారు. అయితే తాజాగా గార్డియన్‌లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. అన్ని స్టేడియాల నుంచి బీర్లను నిషేధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే 8 స్టేడియాల దగ్గర బడ్‌వైజర్ స్టాండ్స్ ఉన్నాయి. అయితే వీటిని స్టేడియాలకు దూరంగా తరలించాలని ఖతార్ నిర్వాహకులు చెబుతున్నారు. ఆతిథ్య హక్కులు పొందే సమయంలో అన్ని వాణిజ్య ఒప్పందాలను అంగీకరిస్తామని చెప్పి.. ఇప్పుడిలా చేయడంతో ఫిఫా నిర్వాహకులు గందరగోళంలో పడ్డారు.
2009లో ఖతార్ ఈ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులను పొందింది. ఆల్కహాల్ పాలసీ ప్రకారం.. కార్పొరేట్ క్లైంట్లకు మాత్రమే స్టేడియాల్లోని రెస్టారెంట్లు, లాంజ్‌లలోనే షాంపేన్, వైన్స్, స్పిరిట్స్ ఇస్తారు. ఇక హైఎండ్ హోటల్స్, క్రూయిజ్ షిప్స్‌లలో ఉండే ఫ్యాన్స్ కూడా వివిధ రకాలైన ఆల్కహాల్ డ్రింక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
నిజానికి ఖతార్‌లో పబ్లిగ్గా తాగడం నిషేధం. అలా చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు విధిస్తారు. అయితే వరల్డ్ కప్ జరిగే సమయాల్లో మాత్రం ఇలాంటివి చూసీ చూడనట్లు ఉంటామని ఖతార్ సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ చెప్పారు. అయితే తాగి గొడవలకు దిగితే మాత్రం అరెస్టులు తప్పవని హెచ్చరించారు.