National Sports Day: దిగ్గజ ప్లేయర్ జయంతిని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం - ఆ ప్లేయర్ ఎవరంటే
National Sports Day: నేడు జాతీయ క్రీడా దినోత్సవం. ఎవరి పుట్టినరోజును నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నామో తెలుసా...
National Sports Day: గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది ఆగస్ట్ 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఆగస్ట్ 29వ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆ రోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం కారణం ఎవరో తెలుసా... హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్(Dhyan chand). నేడు ఆయన జయంతి. 1905 ఆగస్ట్ 29న ధ్యాన్ చంద్ జన్మించారు.
ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి మూడు బంగారు పతకాలు అందించిన గొప్ప క్రీడాకారుడు. క్రికెట్ కు అంతగా వైభవం లేని రోజుల్లో హాకీ క్రీడ ద్వారా ఇండియా పేరుప్రతిష్టల్ని అంతర్జాతీయంగా చాటిచెప్పారు. మన దేశంలో హాకీ క్రీడకు ఆద్యుడిగా ధ్యాన్‌చంద్ ను అభివర్ణిస్తుంటారు. 1928,1932, 1936 ధ్యాన్ చంద్ సారథ్యంలో ఇండియా హాకీ జట్టు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ దక్కించుకున్నది.
మెరుపు వేగంతో గోల్స్ చేయడం ధ్యాన్‌చంద్ ప్రత్యేకత. తన ఫుట్ వర్క్ తో ఎదుటి ఆటగాళ్లను సులభంగా బోల్తా కొట్టించేవాడు. హాకీ క్రీడతో పాటు ఆర్మీ అధికారిగా అతడు దేశానికి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. అతడి జయంతి రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా 2012లో ప్రకటించింది.
అప్పటి నుండి ఆగస్ట్ 29వ తేదీని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకోవడం మొదలైంది. వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతోనే స్పోర్ట్స్ డే రోజున ప్రభుత్వాలు క్రీడలకు సంబంధించిన పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. హాకీ క్రీడకు వన్నెతెచ్చిన ధ్యాన్ చంద్ కు ఇప్పటివరకు భారత రత్న అవార్డు మాత్రం దక్కలేదు.