cwg 2022: టీ20 క్రికెట్‌లో ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్ - ఫైన‌ల్‌లో ఓట‌మిపాలైన హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన‌-india women s cricket team clinched silver medal in cwg 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022: టీ20 క్రికెట్‌లో ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్ - ఫైన‌ల్‌లో ఓట‌మిపాలైన హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన‌

cwg 2022: టీ20 క్రికెట్‌లో ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్ - ఫైన‌ల్‌లో ఓట‌మిపాలైన హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన‌

HT Telugu Desk HT Telugu
Aug 08, 2022 06:20 AM IST

కామన్వెల్త్ గేమ్స్ టీ20 క్రికెట్ లో భారత మహిళల క్రికెట్ జట్టు సిల్వర్ మెడల్ దక్కించుకున్నది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి భారత జట్టు ఓటమి పాలైంది.

హర్మాన్ ప్రీత్ కౌర్
హర్మాన్ ప్రీత్ కౌర్ (twitter)

కామ‌న్వెల్త్ గేమ్స్‌ టీ20 క్రికెట్‌లో అస‌మాన ఆట‌తీరుతో ఫైన‌ల్ చేరుకున్న భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ప‌రాజ‌యం పాలైంది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో తొమ్మిది ప‌రుగులు తేడాతో ఓట‌మి పాలై సిల్వ‌ర్ మెడ‌ల్‌తో స‌రిపెట్టుకున్న‌ది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో ఇండియా 152 రన్స్ కే ఆలౌట్ అయ్యింది.

ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్ లో మూనే 41 బాల్స్ లో 61 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. కెప్టెన్ లాన్నింగ్ 36 రన్స్, గార్డ్నర్ 25, హేన్స్ 18 రన్స్ తో మెరవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో రేణుక సింగ్, స్నేహా రాణా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధన వికెట్లు కోల్పోయింది. సృతి మంధన కేవలం ఆరు పరుగులకే ఔట్ అయ్యింది. రోడ్రిగ్స్ తో కలిసి కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ ఇండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నది.

వీరిద్దరు కలిసి స్కోరును వంద పరుగులు దాటించడంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో గెలుస్తుందని అభిమానులు ఆశించారు. 33 బాల్స్ లో 33 పరుగులు చేసిన రోడ్రిగ్స్ ఔటయ్యింది. మిగిలిన ప్లేయర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. హర్మన్ ప్రీత్ 43 బాల్స్ లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 65 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డ్నర్ కు మూడు వికెట్లు దక్కాయి. ఆ విజయంతో ఆస్ట్రేలియాకు గోల్డ్ మెడల్ దక్కగా ఇండియా సిల్వర్ మెడల్ అందుకున్నది.

WhatsApp channel