Messi Image in Farm Land: వావ్.. 124 ఎకరాల్లో మెస్సీ ఫొటో.. ఓ రైతు చేసిన అద్భుతం
Messi Image in Farm Land: 124 ఎకరాల భూమిలో మెస్సీ ఫొటో అంటే మాటలు కాదు. అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలిచి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఆ దేశ రైతు చేసిన అద్భుతం ఇది. అంతరిక్షం నుంచీ కనిపిస్తోందంటే ఇది ఎలాంటి అద్భుతమో ఊహించండి.
Messi Image in Farm Land: డిసెంబర్ 18, 2022.. అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ఫిపా వరల్డ్ కప్ గెలిచిన రోజు అది. బుధవారానికి (జనవరి 18) ఈ అద్భుతం జరిగి సరిగ్గా నెల రోజులు అయింది. దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి అర్జెంటీనాకు చెందిన ఓ రైతు మరో అద్భుతమే చేశాడు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 124 ఎకరాల్లో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఫొటోను ఆవిష్కరించాడు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి అర్జెంటీనా కప్పు గెలిచిన విషయం తెలిసిందే. టోర్నీ మొత్తం రాణించిన కెప్టెన్ మెస్సీ.. ఫైనల్లోనూ మెరిశాడు. 1986 తర్వాత తన దేశానికి మరో ట్రోఫీని అందించాడు. ఆ సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న అర్జెంటీనా.. అది జరిగి నెల రోజులు పూర్తయిన సందర్భాన్ని కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంది.
అందులో భాగంగానే సెంట్రల్ కార్డోబా ప్రావిన్స్ లోని లాస్ కాండోరెస్ లో ఉన్న తన భూమిలో ఓ రైతు ఇలా మెస్సీ భారీ ఫొటోను రూపొందించాడు. సరిగ్గా మెస్సీ రూపం ఆవిష్కృతం అయ్యేలా మొక్కజొన్న పంటను వేశాడు. దీనికోసం ఆ రైతు ఓ అల్గారిథాన్ని ఫాలో అయ్యాడు. 124 ఎకరాలు అంటే మాటలు కాదు. అంత పెద్ద భూమిలో మెస్సీ రూపం సరిగ్గా వచ్చేలా పంటను నాటడం నిజంగా అద్బుతమే.
ప్రపంచంలో మొక్క జొన్నను అత్యధికంగా పండించే దేశాల్లో ఒకటి అర్జెంటీనా. అదే సమయంలో ఫుట్ బాల్ ను అమితంగా ప్రేమించే దేశం. ఈ రెండింటినీ కలిపి మ్యాక్సిమిలియానో స్పినాజ్ అనే ఆ రైతు ఈ కళ్లు చెదిరే అద్భుతం చేశాడు. మెస్సీ ఫొటోను అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చని చెబుతుండటం ఇక్కడ అసలు విశేషం.
తాము వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పడానికి ఇంత కంటే గొప్ప విధానం ఏముంటుందని ఆ రైతు చెప్పాడు. మెస్సీకి చెందిన ఇంత భారీ ఫొటో రావడానికి కారణం కార్లోస్ ఫారిసెల్లీ అనే ఓ ఇంజినీర్. అతడే విత్తనాలను నాటే మెషీన్ కు కోడింగ్ అందించాడు. జియోకోడింగ్ టూల్స్ ఉపయోగించి తాను ఈ పని చేసినట్లు సదరు ఇంజినీర్ వెల్లడించాడు.
సంబంధిత కథనం