Martina Navratilova: క్యాన్సర్‌ను జయించిన టెన్నిస్ లెజెండ్.. హ్యాట్సాఫ్ మార్టినా
Martina Navratilova: క్యాన్సర్‌ను జయించింది టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా. గొంతు, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఆమె.. సకాలంలో చికిత్స తీసుకొని ఈ మహమ్మారి నుంచి బయటపడింది.
Martina Navratilova: లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా కోర్టు బయట కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. క్యాన్సర్ మహమ్మారిని ఆమె జయించింది. గొంతు, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడం విశేషం. 66 ఏళ్ల మార్టినా.. తనకు చికిత్స అందించిన డాక్టర్లు, తనకోసం ప్రార్థించిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పింది.
తాను క్యాన్సర్ నుంచి బయటపడిన విషయాన్ని నవ్రతిలోవా ట్విటర్ ద్వారా వెల్లడించింది. "ఒక రోజంతా స్లోవన్ కెటెరింగ్ లో టెస్టులు జరిగిన తర్వాత అంతా బాగుందని చెప్పారు. అందరూ డాక్టర్లు, నర్సులు, రేడియేషన్ మెజీషియన్లకు థ్యాంక్స్. చాలా ఊరటగా ఉంది" అని నవ్రతిలోవా ట్వీట్ చేసింది.
ఈ ఏడాది జనవరిలో మార్టినా క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ప్రతినిధి ద్వారా మీడియాకు వెల్లడించింది. క్యాన్సర్ చాలా తీవ్రమైన జబ్బే అయినా.. దాని నుంచి కోలుకుంటానన్న నమ్మకం తనకు ఉందని మార్టినా చెప్పింది. నిజానికి 2010లోనే ఆమె రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత ఆమెకు లంపెక్టమీ నిర్వహించారు.
ఆ తర్వాత గతేడాది నవంబర్ లో తన గొంతు భాగంలో ఆమె మరో కణతిని గుర్తించింది. బయాప్సీ నిర్వహించగా.. అది క్యాన్సర్ కణతి అని, ప్రారంభ దశలోనే ఉందని తేలింది. ఆరు నెలలుగా దీనికి చికిత్స తీసుకుంటూ.. మొత్తానికి ఆ మహమ్మారి నుంచి బయటపడింది. ఇప్పుడు టీవీ బ్రాడ్‌కాస్టర్ గా తన పనిని తిరిగి మొదలుపెట్టింది.
నవ్రతిలోవా కెరీర్ ఇదీ..
టెన్నిస్ చరిత్రలోని గొప్ప ఫిమేల్ ప్లేయర్స్ లో నవ్రతిలోవా కూడా ఒకరు. ఓపెన్ ఎరాలో మొత్తంగా ఆమె 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచింది. కెరీర్ లో 167 డబ్ల్యూటీఏ టైటిల్స్ కూడా సొంతం చేసుకుంది. ఓపెన్ ఎరాలో ఏ ఇతర మహిళా టెన్నిస్ క్రీడాకారిణి కూడా ఇన్ని డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలవలేదు. గ్రాస్ కోర్టు క్వీన్ గా నవ్రతిలోవా పేరుగాంచింది.
అందుకే వింబుల్డన్ టైటిల్ ను ఆమె ఏకంగా 9 సార్లు గెలుచుకోవడం విశేషం. 1978, 1979, 1982, 1983, 1984, 1985, 1986, 1987, 1990లలో నవ్రతిలోవా వింబుల్డన్ టైటిల్స్ గెలిచింది. కెరీర్లో ఆమె 86.8 శాతం మ్యాచ్ లను గెలవడంతోపాటు 1978లో నంబర్ వన్ ర్యాంక్ ను కూడా సొంతం చేసుకుంది.
సంబంధిత కథనం