Tennis Styles| టెన్నిస్ ప్లేయింగ్ స్టైల్స్ ఏవి? ఏ ప్లేయర్ స్టైల్ ఏంటి?
Tennis Styles.. ఓ స్టైల్‌ను ఎంచుకొని, దానిపై పట్టు సాధించడం ఒకెత్తయితే.. ప్రత్యర్థి స్టైల్ తెలుసుకొని అందుకు తగినట్లు సరైన వ్యూహంతో ఆడటం ముఖ్యం. టెన్నిస్‌లో ప్రధానంగా నాలుగు ప్లేయింగ్ స్టైల్స్ ఉంటాయి. అవి అగ్రెసివ్ బేస్‌లైనర్, సర్వ్ అండ్ వాలీయర్, కౌంటర్ పంచర్, ఆల్ కోర్ట్ ప్లేయర్.
Tennis Styles.. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో ఒక్కో ప్లేయర్ ఒక్కో స్టైల్లో ఆడతాడు. ప్రత్యర్థిని ఓడించడానికి ఓ స్టైల్‌ను ఎంచుకొని, దానిపై పట్టు సాధించడం ఒకెత్తయితే.. ప్రత్యర్థి ప్లేయర్ స్టైల్ తెలుసుకొని అందుకు తగినట్లు సరైన వ్యూహంతో ఆడటం ముఖ్యం. టెన్నిస్‌లో ప్రధానంగా నాలుగు ప్లేయింగ్ స్టైల్స్ ఉంటాయి. అవి అగ్రెసివ్ బేస్‌లైనర్, సర్వ్ అండ్ వాలీయర్, కౌంటర్ పంచర్, ఆల్ కోర్ట్ ప్లేయర్. ప్రస్తుతం ఈ స్పోర్ట్‌లో టాప్ ప్లేయర్స్‌గా ఉన్న వాళ్లు ఈ నాలుగు స్టైల్స్‌లో ఒకదాన్ని ఫాలో అయ్యేవాళ్లే. మరి ఈ నాలుగు ప్లేయింగ్స్ స్టైల్స్ ఏంటి? ఏ ప్లేయర్ ఏ స్టైల్‌లో ఆడతాడు అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
అగ్రెసివ్ బేస్‌లైనర్
టెన్నిస్‌లో బేస్‌లైన్ తెలుసు కదా. కోర్టుకు ఇరువైపులా ఉండే చివరి లైన్ ఇది. ఈ బేస్‌లైన్ బయటి నుంచే ప్లేయర్స్ సర్వ్ చేస్తారు. అయితే నెట్‌కు దూరంగా ఇదే బేస్‌లైన్ ఆధారంగా ఆడేవాళ్లు ఉన్నారు. వీళ్లు అగ్రెసివ్ బేస్‌లైనర్స్. ఈ స్టైల్ ఎంచుకున్న ప్లేయర్స్ మ్యాచ్‌పై పూర్తిగా పట్టు బిగించి, శాసించాలని అనుకుంటారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తూ.. తమ గ్రౌండ్‌స్ట్రోక్‌లపైనే ఎక్కువగా ఆధారపడతారు. ప్రత్యర్థిని కోర్టులో అటూఇటూ పరుగెత్తేలా చేస్తారు. బేస్‌లైన్ బయట ఉంటూ.. తరచూ విన్నర్ల కోసం ప్రయత్నిస్తుంటారు.
ఈ స్టైల్ ప్లేయర్స్ ప్రధాన ఆయుధం తమ ఫోర్‌హ్యాండ్ షాట్లే. కోర్టులో మూలమూలకూ షాట్లు ఆడటానికి ఇష్టపడతారు. విన్నర్ల కోసం వీళ్లు కొన్ని అనవసర తప్పిదాలు చేసే రిస్క్ కూడా తీసుకుంటారు. ఈ ప్లేయర్స్ సాధారణంగా అసలు నెట్ దగ్గరికి వచ్చి ఆడరు. వీళ్లు వాలీ (బాల్ కోర్టులో బౌన్స్ కాకముందే కొట్టే షాట్) ఆడటంలో ఇబ్బంది పడతారు. వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జోకొవిచ్, మాజీ నంబర్ రఫెల్ నడాల్, మహిళల మాజీ నంబర్ వన్ మారియా షరపోవాలాంటి ప్లేయర్స్ అగ్రెసివ్ బేస్‌లైనర్లే.
సర్వ్ అండ్ వాలీయర్
అగ్రెసివ్ బేస్‌లైనర్‌కు పూర్తి విరుద్ధమైన ఆట ఈ సర్వ్ అండ్ వాలీయర్లు ఆడతారు. ఈ ప్లేయర్స్ తాము సర్వ్ చేయగానే నెట్ దగ్గరకు పరుగెత్తుకొచ్చి వాలీ షాట్లు ఆడతారు. అదే ప్రత్యర్థి సర్వ్‌ను రిటర్న్ చేసే సమయాల్లో ప్రతిసారీ వీళ్లు నెట్ దగ్గరకు వచ్చి ఆడరు. కాకపోతే అవకాశం దొరికినప్పుడల్లా నెట్‌కు దగ్గరగా వచ్చి ఆడటానికి ఇష్టపడతారు. వాలీలతోనే పాయింట్లు సాధించడం వీళ్ల వ్యూహం. ఆధునిక టెన్నిస్‌లో ఈ స్టైల్ ఎంచుకునే ప్లేయర్స్ తగ్గిపోయారు. గతంలో రదెక్ స్టెపానెక్, పీట్ సంప్రాస్, మార్టినా నవ్రతిలోవా వంటి ప్లేయర్స్ సర్వ్ అండ్ వాలీ స్టైల్ ఆటను ఇష్టపడేవాళ్లు.
కౌంటర్‌పంచర్
కౌంటర్‌పంచర్‌లనే టెన్నిస్‌లో పుషర్ అని కూడా అంటారు. వీళ్లు కోర్టులో మరీ అంత దూకుడుగా ఉండరు. ఎక్కువ భాగం రక్షణాత్మకంగా ఆడుతుంటారు. టెన్నిస్‌లో మూడింట రెండు వంతుల పాయింట్లు ఎర్రర్ల ద్వారానే వస్తాయని ఈ కౌంటర్‌పంచర్‌లకు తెలుసు. అందుకే వాళ్లు ఎలాంటి అనవసర తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడుతూనే.. ప్రత్యర్థిని తప్పిదం చేసేలా ఒత్తిడిలోకి నెడతారు.
ఈ స్టైల్ ఎంచుకున్న ప్లేయర్స్ తమ విన్నర్ల ద్వారా కాకుండా ప్రత్యర్థి తప్పిదాల ద్వారానే ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారు. దూకుడుగా ఆడకపోయినా.. కోర్టులో అటూఇటూ వేగంగా కదులుతుంటారు. దీనివల్ల ప్రత్యర్థులు దూకుడైన షాట్లు ఆడి, తప్పిదాలు చేసేలా ఒత్తిడి తెస్తారు. వీళ్ల దగ్గర విన్నర్ల కోసం ప్రత్యేకంగా ఓ ఆయుధం అంటూ ఏదీ ఉండదు. బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే, డేవిడ్ ఫెర్రర్, వోజ్నియాకి, గేల్ మోన్‌ఫిల్స్‌లాంటి ప్లేయర్స్ ఈ కౌంటర్‌పంచ్ స్టైల్‌లో ఆడేవాళ్లు.
ఆల్‌కోర్ట్ ప్లేయర్
పేరులో ఉన్నట్లే ఈ ప్లేయర్స్ భిన్నమైన షాట్లు ఆడగలరు. ఒక స్టైల్‌కు పరిమితం కాకుండా, పరిస్థితులు, ప్రత్యర్థి బలహీనతలను బట్టి షాట్లు ఆడుతూ.. వీళ్లు పాయింట్లు సాధిస్తారు. కౌంటర్‌పంచర్‌లపై ఆడుతున్న సమయంలో నెట్ దగ్గర చాలా దూకుడుగా ఆడతారు. సర్వ్ అండ్ వాలీ ప్లేయర్స్‌పై బేస్‌లైన్ బయట ఉంటూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తారు.
టెన్నిస్‌లో ప్రధానమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, వాలీలు, డ్రాప్ షాట్లు.. ఇలా అన్ని రకాలు షాట్లు ఆడగలరు. వీళ్లు అన్ని షాట్లు ఆడతారు కాబట్టి.. ప్రత్యేకంగా వీళ్ల బలం ఇదీ అని చెప్పలేం. ఆల్‌టైమ్ గ్రేట్ టెన్నిస్ ప్లేయర్స్‌లో ఒకడైన రోజర్ ఫెదరర్, జో విలిఫ్రైడ్ సోంగా, క్విటోవా, రద్వాంస్కా, జాన్ ఇస్నర్‌లాంటి ప్లేయర్స్ ఈ ఆల్‌కోర్ట్ ప్లేయర్స్ లిస్ట్‌లో ఉన్నారు.
సంబంధిత కథనం