PV Sindhu Coach : పీవీ సింధుకు కొత్త కోచ్.. ఈసారి ఒలింపిక్స్ వరకు-malaysias muhammad hafiz hashim approved as new coach of pv sindhu sports authority of india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pv Sindhu Coach : పీవీ సింధుకు కొత్త కోచ్.. ఈసారి ఒలింపిక్స్ వరకు

PV Sindhu Coach : పీవీ సింధుకు కొత్త కోచ్.. ఈసారి ఒలింపిక్స్ వరకు

Anand Sai HT Telugu
Jul 18, 2023 10:27 AM IST

PV Sindhu New Coach : ఒలింపిక్ పతక విజేత షట్లర్ పివి సింధుకు రాబోయే పారిస్ ఒలింపిక్స్ వరకు మహ్మద్ హఫీజ్ హషీమ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అనుమతులు వచ్చాయి.

పీవీ సింధు
పీవీ సింధు (PTI)

మలేషియాకు చెందిన ఆల్ ఇంగ్లండ్ మాజీ ఛాంపియన్ మహ్మద్ హఫీజ్ హషీమ్(Muhammad Hafiz Hashim) భారత స్టార్ అథ్లెట్ పీవీ సింధు(PV Sindhu)కు కొత్త కోచ్‌గా రానున్నాడు. సింధు కోచ్‌గా హషీమ్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) ఆమోదించింది. తద్వారా మలేషియాకు చెందిన ముహమ్మద్ హఫీజ్ రాబోయే టోర్నీల్లో పీవీ సింధుకు మార్గనిర్దేశం చేయనున్నాడు.

హషీమ్‌ను తన కోచ్‌గా నియమించాలని గత నెలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority Of India) యొక్క మిషన్ ఒలింపిక్ సెల్ (MOC) గురువారం అభ్యర్థనను ఆమోదించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు సింధుకు హషీమ్ కోచ్ పదవిలో ఉంటాడు.

ఈ వారం కొరియా ఓపెన్‌లో ఆడుతున్న సింధును కలిసేందుకు హషీమ్ సోమవారం న్యూఢిల్లీ నుండి వెళ్లాడు. 'కొరియా ఓపెన్ తర్వాత, జపాన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు ఆసియా గేమ్స్‌లో సింధుకు కోచ్‌గా హాషిమ్ కూడా వెళ్తాడు.' అని హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ (SBA) సహ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ ప్రదీప్ రాజు తెలిపారు.

గత ఫిబ్రవరిలో రాజు సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో హషీమ్‌ని కోచ్‌గా తీసుకొచ్చాడు. సింధు ఈ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంది. కోచ్ హషీమ్ ప్రయాణ భత్యం, రోజువారీ భత్యం స్పోర్ట్స్ అథారిటీ చెల్లిస్తుందని సమాచారం. అతని వేతనాన్ని SBA మరియు స్పోర్ట్స్ ప్రమోషన్ బాడీ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (OGQ) చెల్లిస్తుంది. ఈ సంస్థ సింధు వెనుక చాలా ఏళ్లుగా ఉంది.

ఇంతకుముందు సింధుకు దక్షిణ కొరియా కోచ్ పార్క్ టే సాంగ్ కోచ్‌గా వ్యవహరించారు. అతని కోచింగ్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, సింధు తన వ్యక్తిగత కోచ్‌గా హఫీజ్‌ను నియమించుకోవడానికి స్పోర్ట్స్ అథారిటీ నుండి అనుమతి కోరింది. అంతకు ముందు ఐదుగురు కోచ్‌లను మార్చిన పీవీ సింధు ఇప్పుడు మలేషియా మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ హషీమ్ వద్ద శిక్షణ తీసుకోనుంది.

సింధు బ్యాడ్మింటన్లో ఈ ఏడాది పెద్దగా సందడి చేయలేదు. 11 టోర్నీలు ఆడిన సింధు తొలి రెండు రౌండ్లలో ఏడుసార్లు ఓడిపోయింది. స్పానిష్ మాస్టర్స్‌లో మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. అంతే కాకుండా రెండుసార్లు సెమీఫైనల్‌కు, ఒకసారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. 2022 కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో సింధు స్వర్ణం సాధించింది.

Whats_app_banner