Kuldeep Yadav Dropped: ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది.. అందరూ అన్నీ మరచిపోతారు: కుల్దీప్‌ను తీసేయడంపై మాజీ స్పిన్నర్
Kuldeep Yadav Dropped: ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందని, ఆ తర్వాత అందరూ అన్నీ మరచిపోతారని మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అనడం విశేషం. కుల్దీప్‌ను తీసేయడంపై అతడు ఇలా స్పందించాడు.
Kuldeep Yadav Dropped: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ నుంచి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించడంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలుసు కదా. గవాస్కర్‌లాంటి మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా ఇదేం టీమ్ సెలక్షన్ అంటూ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న కుల్దీప్‌ను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించారు.
నిజానికి టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనదే. గవాస్కర్ అన్నట్లు నమ్మశక్యంగా కూడా లేదు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై జైదేవ్ ఉనద్కట్‌లాంటి పేస్ బౌలర్ కోసం అంతకుముందు టెస్ట్‌లో రాణించిన స్పిన్నర్‌ను పక్కన పెట్టడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనిపై తాజాగా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ స్పందించాడు.
అతడు నేరుగా కుల్దీప్ పేరును ప్రస్తావించకపోయినా.. అదే అంశంపై స్పందించినట్లుగా ట్వీట్ ఉంది. "ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఆ తర్వాత అందరూ అన్నీ మరచిపోతారు" అని శివరామకృష్ణన్ ట్వీట్ చేయడం విశేషం. రెండో టెస్ట్ తొలి రోజే ఇండియా గెలుస్తుందని అతడు కాన్ఫిడెంట్‌గా చెప్పడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో తొలి రోజు మాత్రం ఇండియానే పైచేయి సాధించింది.
బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి ఇన్నింగ్స్‌లో 227 రన్స్‌కే ఆలౌటైంది. ఉమేష్ యాదవ్, అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ స్థానంలో వచ్చిన జైదేవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మోమినుల్ హక్ మాత్రం 84 రన్స్‌తో రాణించాడు. మిగతా బ్యాటర్లు మంచి స్టార్ట్ ఇచ్చినా.. వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు.
అయితే ఈ మ్యాచ్ నుంచి కుల్దీప్‌ను తప్పించడంపై అంతకుముందు మాజీ క్రికెటర్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. ఇది నమ్మశక్యంగా లేదని అతడు అన్నాడు. ఇంతకంటే కఠినమైన పదాలను వాడాలని ఉన్నా.. 20 వికెట్లలో 8 వికెట్లు తీసిన బౌలర్‌ను ఎలా పక్కన పెడతారంటూ సన్నీ ప్రశ్నించాడు.