Gavaskar on Kuldeep Exclusion: కుల్దీప్‌ను పక్కన పెట్టడమేంటి.. నమ్మశక్యంగా లేదు: గవాస్కర్‌-gavaskar on kuldeep exclusion says its unbelievable ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Kuldeep Exclusion: కుల్దీప్‌ను పక్కన పెట్టడమేంటి.. నమ్మశక్యంగా లేదు: గవాస్కర్‌

Gavaskar on Kuldeep Exclusion: కుల్దీప్‌ను పక్కన పెట్టడమేంటి.. నమ్మశక్యంగా లేదు: గవాస్కర్‌

Hari Prasad S HT Telugu
Dec 22, 2022 09:46 AM IST

Gavaskar on Kuldeep Exclusion: కుల్దీప్‌ను పక్కన పెట్టడమేంటి.. నమ్మశక్యంగా లేదని లెజెండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు టీమిండియా ఎంపిక చేసిన తుది జట్టును చూసి సన్నీ షాక్‌ తిన్నాడు.

తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కుల్దీప్ యాదవ్
తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కుల్దీప్ యాదవ్ (AFP)

Gavaskar on Kuldeep Exclusion: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ను టీమిండియా ఘనంగా గెలిచింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్లేయర్‌ కుల్దీప్‌ యాదవ్‌. మొదట బ్యాట్‌తో, తర్వాత బాల్‌తో బంగ్లాను దెబ్బకొట్టి ఇండియాకు సిరీస్‌లో ఆధిక్యం అందించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. అలాంటి ప్లేయర్‌ను రెండో టెస్ట్‌కు పక్కన పెట్టింది టీమిండియా.

అతని స్థానంలో పేస్‌ బౌలర్‌ జైదేవ్‌ ఉనద్కట్‌కు చోటు కల్పించింది. ఈ నిర్ణయం మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది సాహసోపేత నిర్ణయం అని, నమ్మశక్యంగా లేదని అతడు అనడం గమనార్హం. "ఓ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ను డ్రాప్‌ చేయడం నమ్మశక్యంగా లేదు. ఇదొక్క మాట మాత్రమే నేను చెప్పగలను. ఇది చాలా సున్నితమైన పదం. నాకు చాలా కఠినమైన పదాలను వాడాలని ఉంది. కానీ ఓ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ను పక్కన పెట్టడం నమ్మశక్యంగా లేదు. 20 వికెట్లలో 8 వికెట్లు తీసిన బౌలర్‌ అతడు" అని సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో గవాస్కర్‌ అన్నాడు.

"టీమ్‌లో మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. వాళ్లలో ఒకరిని డ్రాప్‌ చేసి ఉండొచ్చు. కానీ 8 వికెట్లు తీసుకున్న బౌలర్‌ను ఇక్కడి పిచ్‌ పరిస్థితి చూస్తే కచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాల్సిందే" అని సన్నీ అన్నాడు. తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్‌లో ఎంతో విలువైన 40 పరుగులు కూడా చేశాడు.

కుల్దీప్‌ను పక్కనపెట్టడమన్నది దురదృష్టకరమైన నిర్ణయమే అయినా తప్పలేదని స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ చెప్పడం గమనార్హం. టాస్‌ సందర్భంగా రాహుల్‌ మాట్లాడాడు. "కుల్దీప్‌ను పక్కన పెట్టాలన్న నిర్ణయం దురదృష్టకరమే అయినా.. ఇది ఉనద్కట్‌కు ఓ మంచి అవకాశం" అని రాహుల్‌ అన్నాడు.

WhatsApp channel