Virat Kohli IPL Runs: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు-virat kohli become first batter to complete 7000 runs in ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Ipl Runs: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు

Virat Kohli IPL Runs: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు

Maragani Govardhan HT Telugu
May 06, 2023 09:21 PM IST

Virat Kohli IPL Runs: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ 7 వేల పరుగుల మార్కును అధిగమించాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AP)

Virat Kohli IPL Runs: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పిటకే ఎన్నో అరుదైన మైలురాళ్లు తన పేరిట లిఖించుకున్నాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన సత్తా ఏంటో నిరూపించాడు. తాజాగా కోహ్లీ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 7 వేల పరుగుల మైలురాయిని అధిమించాడు. ఐపీఎల్‌లో 7 వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు.

దిల్లీ-బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ 7 వేల మార్కును అందుకున్నాడు. మొత్తంగా 233 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 49 అర్ధ శతకాలు ఉన్నాయి. 129.53 స్ట్రైక్ రేటుతో 36.05 సగటు చొప్పున కోహ్లీ 7000 పరుగులు పూర్తిచేశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్ 6536 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోపక్క డేవిడ్ వార్నర్ 6189 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 6063 పరుగులతో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు.

దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్(54), విరాట్ కోహ్లీ(55) అర్ధ శతకాలతో విజృంభించగా.. కెప్టెన్ డుప్లెసిస్ 45 పరుగులతో రాణించాడు. కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేయగా.. లోమ్రర్ దూకుడుగా ఆడి బెంగళూరు మెరుగైన స్కోరు చేయడంలో తమ వంతు సాయం చేశారు. చివరి రెండు ఓవర్లలో 15 పరుగులే రావడంతో ఆర్సీబీ అనుకున్న స్కోరు చేయలేకపోయింది. దిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 2 వికెట్లు తీయగా.. ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel