Shubman Gill Photo Viral: శుబ్‌మన్ గిల్ ఏడేళ్ల క్రితం ఫొటో వైరల్.. తన ఐడల్‌తో దిగానని స్పష్టం
Shubman Gill Photo Viral: శుబ్‌మన్ గిల్ ఇటీవలే ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు దిగిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఐడల్ విరాట్ కోహ్లీతో ఈ ఫొటోను దిగినట్లు గిల్ పోస్టులో పేర్కొన్నాడు.
Shubman Gill Photo Viral: సోమవారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 58 బంతుల్లో 101 పరుగులు చేసిన గిల్.. ఐపీఎల్ కెరీర్‌లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవడమే కాకుండా ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. శుబ్‌మన్ ఈ సెంచరీతో ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్‌లో ఇలా అన్నింట్లోనూ శతకం సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శుబ్‌గిల్ పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీతో అతడు దిగిన ఈ చిత్రంపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
ఏడేళ్ల క్రితం శుబ్‌మన్ గిల్.. విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఈ ఫొటో వైరల్ అవుతోంది. 2016 జనవరిలో బీసీసీఐ అవార్డుల్లో భాగంగా జూనియర్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా శుబ్‌మన్ నిలిచాడు. అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి ఓ ఫొటోను దిగాడు. తన అభిమాన ఆటగాడితో కలిసి ఈ ఫొటో దిగానని తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా గిల్ పంచుకున్నాడు. "నా ఐడల్‌తో బీసీసీఐ అవార్డుల్లో దిగిన ఫొటో" అంటూ గిల్ ఈ ఫొటోను షేర్ చేశాడు. తాజాగా ఐపీఎల్‌లో సెంచరీ సాధించడంతో ఆ పాత ఫొటో వైరల్ అవుతోంది.
2016 బీసీసీఐ అవార్డుల్లో కోహ్లీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‍గా పాలీ ఉమ్రీగర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో శుబ్‌మన్ గిల్ కూడా బెస్ట్ అండర్-16 క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ఇరువురు ఫొటోను దిగారు.
శుబ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించడంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ కూడా అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. "ప్రస్తుతం తరానికి చెందిన ఆటగాళ్లకు అతడు ఎంతో ప్రభావం చూపుతున్నాడు. దేవుడి ఆశీస్సులు అతడికి ఉండాలి" అని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో పేర్కొన్నాడు.
సంబంధిత కథనం