Jadeja vs CSK: సీఎస్కేతో జడేజా గొడవ ముదిరిందా.. ఆ పోస్ట్ ఎందుకు లైక్ చేశాడు?
Jadeja vs CSK: సీఎస్కేతో జడేజా గొడవ ముదిరిందా.. ఆ పోస్ట్ ఎందుకు లైక్ చేశాడు? ఇప్పుడీ ప్రశ్నలే చెన్నై టీమ్ అభిమానులను వేధిస్తున్నాయి. సీఎస్కే, ధోనీకి వ్యతిరేకంగా ఉన్న ఓ పోస్టును జడ్డూ లైక్ చేయడం వివాదానికి కారణమైంది.
Jadeja vs CSK: రవీంద్ర జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వివాదం మళ్లీ మొదలైందా? ధోనీతో జడ్డూకి పడటం లేదా? తాజాగా జడేజా ఓ వివాదాస్పద పోస్టును లైక్ చేయడంతో ఈ సందేహాలు మొదలయ్యాయి. చెన్నై టీమ్ ను విమర్శిస్తూ చేసిన పోస్ట్ అది. అలాంటి పోస్టును జడ్డూ ఎందుకు లైక్ చేశాడన్న చర్చ మొదలైంది. డీసీతో మ్యాచ్ తర్వాత ఇది తెరపైకి రావడం విశేషం.
చెన్నై అభిమానులను తనను పెద్దగా పట్టించుకోవడం లేదని, తానెప్పుడూ ఔటవుతానా అని చూస్తున్నారని మ్యాచ్ తర్వాత జడేజా అన్నాడు. నిజానికి ధోనీ బ్యాటింగ్ కు వస్తే చూడాలనుకున్న ఫ్యాన్స్.. జడేజా బ్యాటింగ్ కు వచ్చే సమయంలోనే మహి.. మహి అనే గట్టిగా అరిచారు. ఇదే విషయాన్ని మ్యాచ్ తర్వాత జడేజా నవ్వుతూ చెప్పాడు.
అయితే ఓ అభిమాని మాత్రం ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. జడేజా పైకి నవ్వుతున్నా అతడెంతో ఆవేదనతో ఈ మాట అన్నాడని, అతను ఎంతో బాధపడుతున్నాడని అన్నాడు. "జడ్డూ నవ్వుతూ ఈ మాట అన్నా.. లోపల ఎంతో బాధపడుతున్నాడు. నిజంగా అది అతని మనసుకు తగిలిన గాయం. సొంత జట్టు అభిమానులే మద్దతివ్వకపోవడం, నీ వికెట్ కోసం ఎదురు చూడటం దారుణం. మూడు మ్యాచ్ లను గెలిపించినా ఇంకా విమర్శిస్తున్నారు" అని ఆ అభిమాని కామెంట్ చేశాడు.
ఈ పోస్టును జడేజా లైక్ చేయడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. అంటే అతని అభిప్రాయంతో జడ్డూ ఏకీభవిస్తున్నాడా? సీఎస్కే టీమ్, అభిమానులపై జడేజా గుర్రుగా ఉన్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. డీసీతో మ్యాచ్ లోనూ జడ్డూ 27 పరుగులు చేయడంతోపాటు 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.
నిజానికి గతేడాది నుంచే సీఎస్కే, ధోనీతో జడేజాకు విభేదాలు ఉన్నాయన్న వార్తలు మొదలయ్యాయి. ఆ సీజన్ మొదట్లో జడ్డూ కెప్టెన్సీ చేపట్టినా.. సీఎస్కే దారుణంగా విఫలమైంది. తర్వాత అతని నుంచి కెప్టెన్సీ మళ్లీ ధోనీకి ఇచ్చారు. జడేజా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.
ఇక ఆ జట్టుతో జడ్డూ బంధం తెగిపోయినట్లే అని భావించినా.. అతన్ని రిటెయిన్ చేసుకున్న సీఎస్కే విభేదాల వార్తలన్నీ ఉత్తవే అని తేల్చి చెప్పినట్లయింది. ఈ సీజన్ మొదట్లో ధోనీ, జడేజా కలిసిమెలిసి ఉన్న ఫొటోలు కూడా వీళ్ల మధ్య విభేదాల పుకార్లకు చెక్ పెట్టింది. అయితే తాజాగా జడ్డూ చేసిన ఈ పనితో మరోసారి జడేజా వెర్సస్ సీఎస్కే చర్చ తెరపైకి వచ్చింది.
సంబంధిత కథనం