Who is Atharva Taide: ఎవరీ అథర్వ.. కొండంత లక్ష్యం ముందు కొరకరాని కొయ్య.. పంజాబ్ ఓడినా అతడు గెలిచాడు
Who is Atharva Taide: పంజాబ్‌పై లక్నో 257 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 56 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినప్పటికీ.. ఆ జట్టు ఆటగాడు అథర్వ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు.
Who is Atharva Taide: మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‍లో ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు సాధించిన లక్నోను పంజాబ్ యువ క్రికెటర్ దాదాపు భయపెట్టే ప్రయత్నం చేశాడు. అతడే అథర్వ తైదై. పంజాబ్ మ్యాచ్ ఓడినప్పటికీ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. లక్ష్యం కొండంత ఉన్నా.. ఏ మాత్రం బెదరక అతడు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో భాగంగా మెరుపు అర్ధ సెంచరీతో రాణించాడు అథర్వ.
258 పరుగుల లక్ష్య ఛేదనంలో బరిలోకి దిగిన పంజాబ్‌కు శుభారంభమేమి దక్కలేదు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇలాంటి సమయంలో వన్డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అథర్వ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 66 పరుగులు సాధించి లక్నో బౌలర్లను భయపెట్టాడు. అతడు సికిందర్ రజాతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఐపీఎల్ కెరీర్‌లో కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న అథర్వ.. ఏ మాత్రం అదురు, బెదురు లేకుండా మైదానంలో చిచ్చిరపిడుగువలే విరుచుకుపడ్డాడు. అతడు ఉన్నంత సేపు లక్నో ఆత్మ రక్షణ ధోరణిలో పడిందంటే అర్థం చేసుకోవచ్చు. అతడు ఏ విధంగా ఆడాడు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఫలితంగా ఐపీఎల్ కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 26 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
దూకుడు మీదున్న అథర్వను రవిభిష్ణోయ్ ఔట్ చేయడంతో పంజాబ్ స్కోరు వేగం తగ్గింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోవడంతో పంజాబ్ ఓటమి పాలైంది. మొత్తంగా 19.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.
ఎవరీ అథర్వ తైదే..
మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన అథర్వ తైదే 2018-19 సీజన్ విజయ్ హజారే ట్రోఫీతో తన లిస్ట్-ఏ క్రికెట్‌ను ప్రారంభించాడు. విదర్భ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు. 2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2022 ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ అథర్వ తైదేను సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు నాలుగే ఐపీఎల్‌లు ఆడిన అతడు.. 99 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధశతకం ఉంది. ఇక లిస్ట్-ఏ క్రికెట్‌లో అథర్వ.. 24 మ్యాచ్‌ల్లో 758 పరుగులతో పాటు 8 వికెట్లు పడగొట్టాడు. 33 టీ20 మ్యాచ్‌లల్లో 774 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ దగ్గరకొస్తే 15 మ్యాచ్‌ల్లో 887 పరుగులు సహా 10 వికెట్లు పడగొట్టాడు.