India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తేదీని మార్చిన ఐసీసీ.. మరో 8 మ్యాచ్‍లకు కూడా..
India vs Pakistan: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‍లో మార్పులు చేసింది ఐసీసీ. తొమ్మిది మ్యాచ్‍ల తేదీలను మార్చింది.
India vs Pakistan: భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ మధ్య ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్ తేదీలతో సహా షెడ్యూల్‍ను ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ మ్యాచ్‍ల కారణంగా షెడ్యూల్‍లో మార్పులు తప్పలేదు. దీంతో ప్రపంచకప్ టోర్నీలో 9 మ్యాచ్‍ల తేదీలను ఐసీసీ మార్చింది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‍తో పాటు మరో 8 మ్యాచ్‍ల తేదీల్లో మార్పు చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ నేడు (ఆగస్టు 9) అధికారికంగా వెల్లడించింది.
తొలుత షెడ్యూల్ ప్రకారం వన్డే ప్రపంచకప్‍లో అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉండేది. అయితే, దీన్ని అక్టోబర్ 14వ తేదీకి (డే నైట్) మార్చింది ఐసీసీ. అంటే ముందుగా ప్రకటించిన దాని కంటే ఒక రోజు ముందుగానే భారత్, పాక్ తలపడనున్నాయి. అక్టోబర్ 15వ తేదీన దసరా నవరాత్రులు ప్రారంభం కానుండడంతో అక్టోబర్ 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్‍ను మార్చాల్సి వచ్చింది.
దీని కారణంగా అక్టోబర్ 14న జరగాల్సిన ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఒక రోజు ఆలస్యం కానుంది. అఫ్గాన్, ఇంగ్లండ్ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన జరగనుంది.
పాకిస్థాన్, శ్రీలంక మధ్య అక్టోబర్ 12వ తేదీన హైదరాబాద్‍లో జరగాల్సిన మ్యాచ్.. అక్టోబర్ 10వ తేదీకి మారింది. దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో అక్టోబర్ 13న జరగాల్సిన మ్యాచ్ 24 గంటలు ముందుగా అక్టోబర్ 12కు వెళ్లింది.
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య చెన్నైలో అక్టోబర్ 14న డే మ్యాచ్‍గా జరగాల్సిన పోటీ.. అక్టోబర్ 13వ తేదీకి డే నైట్ మ్యాచ్‍గా మారింది.
అక్టోబర్ 14న ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ మధ్య డే మ్యాచ్ గా జరగాల్సిన పోటీ అక్టోబర్ 15కు మారింది.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య పుణెలో నవంబర్ 12న జరగాల్సిన మ్యాచ్ ఒక రోజు ముందుకు అంటే నవంబర్ 11కు వచ్చింది.
పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 12న కోల్‍కతా వేదికగా జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 11వ తేదీకి (డే నైట్)కి మారింది.
ఇండియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన లాస్ట్ లీగ్ మ్యాచ్ నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీకి (డే నైట్) వెళ్లింది. మారిన తేదీల ప్రకారం కొత్త షెడ్యూల్‍ను ఐసీసీ ప్రకటించింది.