Asian Games IND vs PAK : స్క్వాష్ ఫైనల్‍లో పాకిస్థాన్‍ను చిత్తు చేసిన భారత్.. ఖాతాలో మరో స్వర్ణం-india defeated pakistan in mens squash team final in asian games bags gold ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asian Games Ind Vs Pak : స్క్వాష్ ఫైనల్‍లో పాకిస్థాన్‍ను చిత్తు చేసిన భారత్.. ఖాతాలో మరో స్వర్ణం

Asian Games IND vs PAK : స్క్వాష్ ఫైనల్‍లో పాకిస్థాన్‍ను చిత్తు చేసిన భారత్.. ఖాతాలో మరో స్వర్ణం

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 30, 2023 04:27 PM IST

Asian Games: 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత్‍కు మరో స్వర్ణం దక్కింది. స్క్వాష్ పురుషుల టీమ్ ఫైనల్‍లో పాకిస్థాన్‍ను భారత ప్లేయర్లు చిత్తు చేశారు.

Asian Games IND vs PAK : పాకిస్థాన్‍ను చిత్తు చేసిన భారత్.. ఖాతాలో మరో స్వర్ణం
Asian Games IND vs PAK : పాకిస్థాన్‍ను చిత్తు చేసిన భారత్.. ఖాతాలో మరో స్వర్ణం

Asian Games: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో నేడు (సెప్టెంబర్ 30) భారత పురుషుల స్క్వాష్ టీమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నేడు జరిగిన స్క్వాష్ మెన్స్ టీమ్ ఫైనల్‍లో భారత జట్టు 2-1 తేడాతో పాకిస్థాన్‍ను చిత్తు చేసింది. గోల్డ్ మెడల్‍ను దక్కించుకుంది. ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత్‍కు ఇది పదో స్వర్ణ పతకంగా ఉంది. ఉత్కంఠగా జరిగిన స్క్వాష్ ఫైనల్‍లో సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మన్‍గోన్కర్‌తో కూడిన భారత టీమ్.. పాక్‍ జట్టును ఓడించి.. గోల్డ్ గెలిచింది.

yearly horoscope entry point

ఈ స్క్వాష్ ఫైనల్ మ్యాచ్‍ తొలి గేమ్‍లో 8-11, 3-11, 2-11 తేడాతో పాక్ ప్లేయర్ నాజిర్ ఇక్బాల్ చేతిలో మహేశ్ పరాజయం చెందడంతో 0-1తో ఆరంభంలో భారత్ వెనుకబడింది. అయితే, మహ్మద్ అసీమ్ ఖాన్‍ను 11-5, 11-1, 11-3 తేడాతో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఓడించి అదరగొట్టాడు. అనంతరం నిర్ణయాత్మక గేమ్‍లో భారత ప్లేయర్ అభయ్ సింగ్ అదరగొట్టాడు. 11-7, 9-11, 8-11, 11-9, 12-10తో పాక్ ప్లేయర్ నూర్ జమాన్‍ను 3-2 తేడాతో అభయ్ ఓడించాడు. దీంతో ఫైనల్‍లో 2-1 తేడాతో గెలిచిన భారత్.. స్క్వాష్ పురుషుల టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

అంతకుముందు ఇదే రోజు టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‍లో భారత ప్లేయర్లు రోహన్ బోపన్న, రుతుజ భోసలే విజయం సాధించి.. స్వర్ణం దక్కించుకున్నారు. ఇప్పటి వరకు (సెప్టెంబర్ 30, మధ్యాహ్నం) 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ 36 పతకాలు (10 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్యాలు) కైవసం చేసుకుంది.

నేడు (సెప్టెంబర్ 30) పురుషుల 91కేజీల క్వార్టర్ ఫైనల్‍లో భారత బాక్సర్ నరేందర్ విజయం సాధించాడు. సెమీస్‍లోకి చేరి పతకాన్ని పక్కా చేసుకున్నాడు. మహిళల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సెమీస్ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నారు. 

Whats_app_banner