Ind vs Pak: స్కెచ్ వేసేశారా.. పాకిస్థాన్ మ్యాచ్ చూసిన ఇండియన్ ప్లేయర్స్
Ind vs Pak: పాకిస్థాన్ మ్యాచ్ చూశారు ఇండియన్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాతో తమ వామప్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండి ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ ఆడిన వామప్ మ్యాచ్ చూడటం విశేషం.
Ind vs Pak: టీ20 వరల్డ్‌కప్ ఇప్పటికే ప్రారంభమైంది. రెండు రోజుల్లో రెండు సంచలనాలు కూడా నమోదయ్యాయి. మాజీ ఛాంపియన్లు శ్రీలంక, వెస్టిండీస్‌లకు పసికూనలైన నమీబియా, స్కాట్లాండ్‌లు షాకిచ్చాయి. అయితే ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లో ఉండాల్సిన కిక్ మాత్రం ఫ్యాన్స్‌కు రాలేదు. ఆ కిక్కు మరికొన్ని రోజుల్లో రానుంది. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్‌గా పిలుచుకునే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌తో ఆ కిక్కు ఫ్యాన్స్‌కు వస్తుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ తమదైన స్టైల్లో ప్రిపేరవుతున్నాయి. ఒకరి మ్యాచ్‌లు ఒకరు చూస్తూ ఒకరి బలహీనతలు మరొకరు పసిగట్టే పనిలో ఉన్నారు. సోమవారం (అక్టోబర్ 17) ఈ రెండు టీమ్స్ వామప్ మ్యాచ్‌లు ఆడాయి. ఆస్ట్రేలియాతో ఇండియా, ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 6 రన్స్‌తో ఇండియా ఓడించగా.. తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్లతో పాక్‌పై గెలిచింది.
అయితే బ్రిస్బేన్‌లోనే ఈ మ్యాచ్‌లు జరగడంతో కాస్త ముందుగానే స్టేడియానికి వచ్చిన పాకిస్థాన్ టీమ్.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ చూసింది. కెప్టెన్ బాబర్ ఆజం, పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ చూసిన వీడియో వైరల్ అయింది. ఇక ఆ తర్వాత ఇండియన్ టీమ్ కూడా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసినా.. స్టేడియంలోనే ఉండిపోయింది.
ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ ఆడిన మ్యాచ్‌ను ఇండియన్ ప్లేయర్స్ అంతా కలిసి చూశారు. అశ్విన్, రాహుల్, హార్దిక్ పాండ్యా, షమి, అర్ష్‌దీప్‌సింగ్‌లాంటి వాళ్లంతా స్టాండ్స్‌లో కనిపించారు. అయితే ప్లేయర్స్ అంతా మధ్యలోనే వెళ్లిపోయినా.. అశ్విన్ మాత్రం మ్యాచ్ మొత్తం ముగిసే వరకూ స్టేడియంలోనే ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో చివరికి ఇంగ్లండ్ 6 వికెట్లతో పాకిస్థాన్‌ను ఓడించింది.
ఈ రెండు టీమ్స్ అక్టోబర్ 19న ఇదే స్టేడియంలో చివరి వామప్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇండియా.. న్యూజిలాండ్‌తో, పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనున్నాయి. ఇక అక్టోబర్ 23న ఇండియా, పాకిస్థాన్ సూపర్ 12 స్టేజ్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ రెండు టీమ్స్ 2022లో తలపడనుండటం ఇది మూడోసారి. ఇప్పటికే ఆసియాకప్‌లో రెండుసార్లు ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లలో చెరొకదాంట్లో విజయం సాధించాయి.