T20 World Cup SL vs NAM: టీ20 వరల్డ్‌కప్‌లో తొలిరోజే సంచలనం - శ్రీలంకకు షాక్ ఇచ్చిన నమీబియా
T20 World Cup SL vs NAM: టీ20 వరల్డ్‌కప్‌లో తొలిరోజు ఆసియా కప్ ఛాంపియన్ శ్రీలంకకు షాక్ తగిలింది. పసికూన నమీబియా చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
T20 World Cup SL vs NAM: టీ20 వరల్డ్‌కప్‌లో తొలిరోజే సంచలనం నమోదైంది. ఆదివారం శ్రీలంకపై పసికూన నమీబియా 55 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఫ్రైలింక్ 44 రన్స్, స్మిట్ 32 రన్స్ తో రాణించారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. ఓపెనర్లు నిషాంక (9 రన్స్), కుశాల్ మెండిస్ (6 పరుగులు)తో గుణతిలక డకౌట్ కావడంతో 21 పరుగులకే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధనుంజయ డిసిల్వా, రాజపక్స కలిసి శ్రీలంకను ఆదుకునే ప్రయత్నం చేశారు.
డిసిల్వా 12 పరుగులు, రాజపక్స 20 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ షనాకా 29 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ అతడికి మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి సహకారం లభించకపోవడంతో శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
నమీబియా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ విలవిలలాడారు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్, షికాంగో, షూల్ట్, ఫ్రైలింక్ తలో రెండు వికెట్లు తీశారు. స్మిట్‌కు ఒక వికెట్ దక్కింది. 44 పరుగులతో పాటు రెండు వికెట్లు తీసిన ఫ్రైలింక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.