T20 World Cup Sco vs WI: వెస్టిండీస్‌కు షాక్.. స్కాట్లాండ్ సంచలన విజయం
T20 World Cup Sco vs WI: వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. రెండు సార్లు ఛాంపియన్‌పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది. ఏకంగా 42 రన్స్ తేడాతో ఆ టీమ్ గెలవడం విశేషం.
T20 World Cup Sco vs WI: టీ20 వరల్డ్‌కప్ తొలి రౌండ్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. తొలి రోజే మాజీ ఛాంపియన్ శ్రీలంకకు నమీబియా షాకిచ్చిన విషయం తెలుసు కదా. తాజాగా రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ కూడా తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతుల్లో ఓడిపోయింది. 2012, 2016లలో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన వెస్టిండీస్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా 42 రన్స్ తేడాతో చిత్తయింది.
161 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ టీమ్.. 18.3 ఓవర్లలో 118 రన్స్‌కే ఆలౌటైంది. జేసన్ హోల్డర్ మాత్రమే 38 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిడిలార్డర్ వైఫల్యం విండీస్ కొంప ముంచింది. కైల్ మేయర్స్ 20, బ్రాండన్ కింగ్ 17 రన్స్ చేశారు. కెప్టెన్ పూరన్ (5), షమార్ బ్రూక్స్ (4), రోవ్‌మన్ పావెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.
ఒక దశలో వికెట్ నష్టానికి 53 పరుగులతో ఉన్న వెస్టిండీస్.. 79 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చివర్లో హోల్డర్ మెరుపులతో విండీస్ స్కోరు వంద దాటింది. ఈ ఓటమితో విండీస్ సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించే అవకాశాలకు తొలి దెబ్బ పడింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 3, బ్రాడ్ వీల్, మైకేల్ లీస్క్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 రన్స్ చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే 53 బాల్స్‌లోనే 66 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉన్నాయి. గ్రూప్ బిలో వెస్టిండీస్, స్కాట్లాండ్‌తోపాటు ఐర్లాండ్, జింబాబ్వే టీమ్స్ ఉన్నాయి.