Ileana: కన్నీళ్లు తుడిచి.. ధైర్యం చెప్పాడు: ప్రియుడి గురించి చెప్పిన ఇలియానా.. వివరాలు మాత్రం..!
Ileana: తన ప్రియుడి గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది హీరోయిన్ ఇలియానా. ప్రెగ్నెన్సీ పట్ల అద్బుతమైన అనుభూతి చెందుతున్నానని తెలిపింది.
Ileana: టాలీవుడ్లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది ఇలియానా. దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. వాటిలో చాలా సూపర్ హిట్ అయ్యాయి. అనంతరం బాలీవుడ్‌కు వెళ్లింది ఇలియానా. అక్కడ ఊహించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. బాలీవుడ్లో ఆమె కెరీర్ ఒడిదొడుకుల మధ్య సాగింది. చివరగా రెండేళ్ల క్రితం ఓ మూవీ చేసింది ఇలియానా. అప్పటి నుంచి వెండి తెరకు దూరంగానే ఉంటోంది. అయితే, కొంతకాలం క్రితం ఇలియానా.. బేబి బంప్ (గర్భం)తో కనిపించటం హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఆమె ప్రియుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇలియానా కూడా వివరాలు చెప్పలేదు. అయితే, తన ప్రియుడి గురించి ఇలియానా తాజాగా ఓ పోస్ట్ చేసింది. అతడు తనను ఎలాంటి పరిస్థితుల్లో కలిశాడో చెప్పింది. కానీ పేరు లాంటివి మాత్రం వెల్లడించలేదు. ఓ ఫొటో షేర్ చేసింది.
తన ప్రియుడితో ఉన్న ఫొటోను ఇలియానా నేడు పోస్ట్ చేసింది. అయితే, ప్రియుడి ముఖం కనిపించకుండా ఫొటో బ్లర్ అయి ఉంది. ఫొటోలో తన ప్రియుడి ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఇలియానా జాగ్రత్త పడింది. కష్టాల్లో తనను అతడు ఎలా ఓదార్చాడో పేర్కొన్న ఇలియానా.. అతడి పేరు సహా ఎలాంటి వివరాలు తెలుపలేదు. ఓ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది.
“నేను తీవ్రమైన వేదనలో ఉండి, నా పట్ల నేను దయగా ఉండడం మరిచిన రోజుల్లో ఆ వ్యక్తి (ప్రియుడు) నాకు అండగా నిలిచాడు. నా హృదయం ముక్కలైందని అనిపించిన ఆ సమయాల్లో అతడు నన్ను ఓదార్చాడు. నా వెన్నంటే ఉన్నాడు. కన్నీళ్లను తుడిచాడు. నేను నవ్వేలా చేశాడు. అందుకోసం జోకులను వేశాడు. నాకు తోడుగా ఉన్నాడు. ఆ సమయంలో నాకు కావాల్సింది అదేనని అతడికి తెలుసు” తన ప్రియుడి గురించి ఇలియానా రాసుకొచ్చింది. అయితే, అతడు ఎవరనేది మాత్రం వివరాలను వెల్లడించలేదు.
తల్లి కాబోతున్న ఈ ప్రయాణాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని, చాలా గొప్ప అనుభూతిని పొందుతున్నానని ఇలియానా పోస్ట్ చేసింది. తనలో మరో ప్రాణం ఊపిరిపోసుకుంటోందనే ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో వర్ణించలేకపోతున్నానని, ఇలాంటి అదృష్టం తనకు లభిస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఇలియానా భావోద్వేగంగా క్యాప్షన్ పోస్ట్ చేసింది.
అయితే, ఇలియానా ప్రియుడు ఎవరు అనే విషయం మాత్రం ఇంకా మిస్టరీగా ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి హింట్లను కూడా ఆమె ఇవ్వలేదు. మరి, అతడిని ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి.