Highest paid female athletes 2022: పీవీ సింధు కళ్లు చెదిరే సంపాదన.. టాప్ 25లో ఏకైక ఇండియన్
Highest paid female athletes 2022: పీవీ సింధు కళ్లు చెదిరే సంపాదనతో దూసుకెళ్తోంది. 2022లో ఫోర్బ్స్ అత్యధిక మొత్తం అందుకున్న మహిళా అథ్లెట్ల టాప్ 25లో ఇండియా నుంచి ఆమెకు మాత్రమే చోటు దక్కడం విశేషం.
Highest paid female athletes 2022: హైదరాబాదీ బ్యాడ్మింటన్ సెన్సేషన్ పీవీ సింధు బ్యాడ్మింటన్ కోర్టులోనే కాదు.. బయట కూడా టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా సంపాదన విషయంలో ఇండియాలోనే టాప్ మహిళా అథ్లెట్ ఆమె. ఫోర్బ్స్ ప్రతి ఏటా రిలీజ్ చేసే అత్యధిక మొత్తం అందుకున్న మహిళా అథ్లెట్ల లిస్ట్ టాప్ 25లో ఇండియా నుంచి సింధుకు మాత్రమే చోటు దక్కింది.
పీవీ సింధు 12వ స్థానంలో నిలవడం విశేషం. 2022లో సింధు కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ గోల్డ్, డబుల్స్ సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయాలతో కోర్టు బయట కూడా ఆమె రేంజ్ పెరిగిపోయింది. ఈ ఏడాది సింధు మొత్తం సంపాదన 71 లక్షల డాలర్లు కాగా.. అందులో బ్యాడ్మింటన్ కోర్టు బయట సంపాదనే 70 లక్షలు కావడం విశేషం.
ఈ లిస్ట్‌ను బట్టి చూస్తే టాప్ అథ్లెట్లకు ఆయా స్పోర్ట్స్ టోర్నీల్లో వచ్చే ప్రైజ్‌మనీల కంటే బయట స్పాన్సర్‌షిప్స్, అంబాసడర్‌షిప్స్ వల్లే అత్యధిక మొత్తం వస్తున్నట్లు తేలింది. ఈ లిస్ట్‌లో ఎప్పటిలాగే టెన్నిస్ ప్లేయర్స్ టాప్‌లో నిలిచారు. టాప్ 25లో ఏకంగా 12 మంది టెన్నిస్ ప్లేయర్సే కావడం విశేషం. ఇక టాప్ 10లో ఏడుగురు వాళ్లే ఉన్నారు.
అత్యధిక సంపాదన ఉన్న మహిళా అథ్లెట్ల లిస్ట్‌లో టెన్నిస్ ప్లేజర్ నవోమి ఒసాకా టాప్‌లో ఉంది. ఆమె 2022లో ఏకంగా 5.11 కోట్ల డాలర్లు ఆర్జించింది. ఆమె తర్వాతి స్థానంలో సెరెనా విలియమ్స్ ఉంది. ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్ 2022లో 4.13 కోట్ల డాలర్లు వెనకేసుకుంది. టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ ఈ లిస్ట్‌లో ఐదోస్థానంలో ఉంది.
టాప్ 10 లిస్ట్‌లో టెన్నిస్ కాకుండా స్కీయింగ్, జిమ్నాస్టిక్స్, గోల్ఫ్ ప్లేయర్స్‌కు కూడా చోటు దక్కింది. మూడోస్థానంలో స్కీయింగ్ అథ్లెట్ చైనాకు చెందిన ఎలీన్ గు నిలిచింది. ఆమె సంపాదన 2.01 కోట్ల డాలర్లుగా ఉంది. ఇక అమెరికాకు చెందిన జిమ్నాస్టిక్స్ స్టార్ సిమోన్ బైల్స్ కోటి డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో ఉంది. అటు ఆస్ట్రేలియాకు చెందిన గోల్ఫర్ మిన్‌జీ లీ 73 లక్షల డాలర్ల ఆర్జనతో పదో స్థానంలో నిలిచింది.