Hardik Pandya: టీ20, వన్డేలు మాత్రమే ఆడతా: హార్దిక్‌ పాండ్యా-hardik pandya says he will focus on white ball cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya: టీ20, వన్డేలు మాత్రమే ఆడతా: హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya: టీ20, వన్డేలు మాత్రమే ఆడతా: హార్దిక్‌ పాండ్యా

Hari Prasad S HT Telugu
Jul 08, 2022 11:14 AM IST

Hardik Pandya: ఇంగ్లండ్‌తో ఫస్ట్‌ టీ20ని గెలిపించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన టార్గెట్‌ ఏంటో చెప్పేశాడు. వైట్‌ బాల్‌ క్రికెట్‌పైనే తాను దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించాడు.

<p>అసలుసిసలు ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్న హార్దిక్ పాండ్యా</p>
అసలుసిసలు ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్న హార్దిక్ పాండ్యా (AFP)

సౌథాంప్టన్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ఐపీఎల్‌ సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అక్కడ గుజరాత్‌ టైటన్స్‌ను విజేతగా నిలిపిన అతడు.. ఇటు ఇండియన్‌ టీమ్‌ విజయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో కెప్టెన్‌గా గెలిపించిన హార్దిక్‌.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై తొలి టీ20లో విజయం సాధించి పెట్టాడు.

హాఫ్‌ సెంచరీతోపాటు నాలుగు వికెట్లు కూడా తీశాడు. ఈ ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచాడు. మ్యాచ్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన హార్దిక్‌ పాండ్యా.. తన లక్ష్యాలేంటో స్పష్టంగా చెప్పాడు. ఇండియాకు టెస్ట్‌ క్రికెట్‌ ఆడటం గురించి తాను ఆలోచించడం లేదని, తన దృష్టంతా టీ20, వన్డే క్రికెట్‌పైనే అని హార్దిక్‌ చెప్పాడు.

తాను 100 శాతం ఇవ్వలేకపోతే టీమ్‌కు ఆడనని కూడా తెలిపాడు. టీమ్‌లో మరొకరి స్థానం తీసుకోవడానికి తాను ఎప్పుడూ చూడనని కూడా అన్నాడు. 2018 నుంచి హార్దిక్‌ టెస్ట్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వెన్ను గాయం కారణంగా చాలా కాలం బౌలింగ్‌ చేయలేకపోయిన అతడు.. ఐపీఎల్‌ 2022తో మళ్లీ టాప్‌ ఫామ్‌లోకి వచ్చాడు. అదే ఊపులో ఇండియన్‌ టీమ్‌లోకి తిరిగొచ్చాడు.

"ప్రస్తుతానికైతే నేను భవిష్యత్తులో ఏం ఆడతాను అన్నదానిపై ఆలోచించడం లేదు. ఇండియాకు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేలా చూసుకుంటాను. ఇది వైట్‌ బాల్‌ సీజన్‌. వరల్డ్‌ కప్‌లు వస్తున్నాయి. దీంతో నా దృష్టంతా వైట్‌బాల్‌పైనే. ఈ సీజన్‌లో నేను ఇండియాకు ఎంత వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆడితే అంత మంచిది. టెస్ట్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం వస్తే కచ్చితంగా ఆడతాను. అయితే నేను ఏది ఆడాలో, ఏది ఆడకూడదో సమయమే చెబుతుంది. నా 100 శాతం ఇవ్వడంపైనే నేను ప్రస్తుతం దృష్టిసారించాను" అని హార్దిక్‌ చెప్పాడు.

తాను 100 శాతం క్రికెటర్‌గా ఆడగలిగితేనే ఆడతానని, లేదంటే లేదని, మరొకరి స్థానం మాత్రం తీసుకోనని తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 33 బాల్స్‌లోనే 51 రన్స్‌ చేసిన హార్దిక్‌.. తర్వాత నాలుగు వికెట్లు కూడా తీశాడు. అందులో జేసన్‌ రాయ్‌, లివింగ్‌స్టోన్‌లలాంటి డేంజరస్‌ బ్యాటర్ల వికెట్లు కూడా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం