Gavaskar on Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్‌ ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది: గవాస్కర్-gavaskar on rohit sharma says his form is the only concern for india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్‌ ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది: గవాస్కర్

Gavaskar on Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్‌ ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది: గవాస్కర్

Hari Prasad S HT Telugu
Oct 25, 2022 09:03 PM IST

Gavaskar on Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్‌ ఒక్కటే ఇండియన్‌ టీమ్‌కు ఆందోళన కలిగిస్తోందని అన్నాడు మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌. అతడు మునుపటి ఫామ్‌లోకి వస్తే తర్వాత వచ్చే బ్యాటర్ల పని చాలా సులువవుతుందని అభిప్రాయపడ్డాడు.

టీమిండియాకు ఆందోళన కలిగిస్తున్న రోహిత్ శర్మ ఫామ్
టీమిండియాకు ఆందోళన కలిగిస్తున్న రోహిత్ శర్మ ఫామ్ (AFP)

Gavaskar on Rohit Sharma: రోహిత్‌ శర్మ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. అతడు ఈ ఏడాది కెప్టెన్‌ అయిన తర్వాత ఇండియా టీ20ల్లో వరుస విజయాలు సాధించినా, సిరీస్‌లు గెలిచినా బ్యాటర్‌గా అతడు విఫలమవుతూనే ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై కూడా అతడు ఫెయిలయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అసాధారణ ఇన్నింగ్స్‌తో గెలిచినా.. రానున్న మ్యాచ్‌లలో రోహిత్‌ ఫామే ఇండియాకు ఉన్న ఏకైక ఆందోళన అని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు.

ఇండియా టుడేతో మాట్లాడిన సన్నీ.. రానున్న నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌పై స్పందించాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఫామ్‌ ఒక్కటే టీమ్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య అని అన్నాడు. "రోహిత్‌ కొంతకాలంగా తన సామర్థ్యానికి తగినట్లుగా ఆడటం లేదు. ఇదే ప్రస్తుతం టీమ్‌కు ఉన్న ప్రధాన ఆందోళన. ఒకవేళ మునుపటి ఫామ్‌లో ఆడితే ఆ తర్వాత వచ్చే బ్యాటర్ల పని చాలా సులువు అవుతుంది" అని గవాస్కర్‌ చెప్పాడు.

తొలి ఆరు ఓవర్లలో ఇండియా వికెట్‌ నష్టపోకుండా, నిదానంగా, స్థిరంగా ఆడాలని సన్నీ సూచించాడు. ఇలా చేస్తే తర్వాత వచ్చే బ్యాటర్లకు మంచి పునాది వేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డాడు. "ప్రతి ఒక్కరూ ఓ మంచి ప్లాట్‌ఫామ్‌ ఉండాలని కోరుకుంటారు. అలా ఓ మంచి ప్లాట్‌ఫామ్‌, మంచి స్టార్ట్‌ ఇస్తే ఆ తర్వాత నాలుగు లేదా ఐదు స్థానాల్లో వచ్చే బ్యాటర్‌ స్వేచ్ఛగా తొలి బంతి నుంచే బాదడం మొదలుపెట్టే అవకాశం దక్కుతుంది.

వాళ్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోలాగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాల్సిన పని ఉండదు. అందుకే 31 పరుగులకు 4 వికెట్ల కంటే నిదానంగా అయినా సరే 40 పరుగులకు ఒక వికెట్‌ చాలా మంచిది" అని గవాస్కర్‌ అన్నాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 160 రన్స్‌ టార్గెట్‌ చేజింగ్‌లో ఇండియా కేవలం 31 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌తోపాటు ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ కూడా విఫలమయ్యారు. దీంతో కోహ్లి, హార్దిక్‌ మొదట ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికే చాలా సమయం తీసుకున్నారు.

దీని కారణంగా చివర్లో చేయాల్సిన పరుగులు ఎక్కువై ఒత్తిడి పెరిగిపోయింది. రాహుల్‌తో కలిసి రోహిత్‌ మంచి ఓపెనింగ్‌ ఇస్తే మిడిలార్డర్‌ సగం పని పూర్తయినట్లే. రానున్న మ్యాచ్‌లలో ఇదే కీలకం కానుంది.

WhatsApp channel