Sehwag on T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోరు చేసేది అతడే: సెహ్వాగ్-sehwag on t20 world cup says babar azam will be the top scorer ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sehwag On T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోరు చేసేది అతడే: సెహ్వాగ్

Sehwag on T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోరు చేసేది అతడే: సెహ్వాగ్

Hari Prasad S HT Telugu
Oct 21, 2022 10:31 AM IST

Sehwag on T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌ గురించి అనూహ్యమైన అంచనాలు వేశాడు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌, ఫైనల్‌ చేరే టీమ్స్‌పై వీరూ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్

Sehwag on T20 World Cup: క్రికెట్‌లో ఏదైనా మెగా టోర్నీ రాబోతోందంటే ఎన్నో నెలల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. టీమ్స్‌ ఎలా ఉండాలి? ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనే అంశాలపై క్రికెట్‌ పండితులు చెప్పే అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్‌ కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా టీ20 వరల్డ్‌కప్‌ ఫైనలిస్టులు, ఈ టోర్నీలో అత్యధిక స్కోరు చేసే బ్యాటర్‌ ఎవరో అంచనా వేశాడు.

ఫైనల్‌ చేరే టీమ్స్‌ సంగతి ఎలా ఉన్నా.. అత్యధిక స్కోరు చేసే బ్యాటర్‌ విషయంలోనే వీరూ అభిప్రాయం చూసి ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని వీరూ అంచనా వేయడం విశేషం. ఇక ఈసారి ఫైనల్‌ చేరే టీమ్స్‌ ఆతిథ్య ఆస్ట్రేలియా, ఇండియా అని కూడా వీరూ చెప్పాడు.

"ఆస్ట్రేలియానే ఆతిథ్యమిస్తోంది. వాళ్లను సొంతగడ్డపై ఓడించడం చాలా కష్టం. ఇక మరో టీమ్‌ ఇండియానే. మన టీమ్‌ చాలా సమతులంగా ఉంది. ఆస్ట్రేలియా కండిషన్స్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది" అని క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్‌ అన్నాడు. ఇక టాప్‌ స్కోరర్‌గా ఎవరు నిలుస్తారని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్‌ మరో ఆలోచన లేకుండా పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అని చెప్పడం విశేషం.

గురువారం (అక్టోబర్‌ 20) తన 44వ పుట్టిన రోజు జరుపుకున్న సెహ్వాగ్‌.. ఇండియా గెలిచిన తొలి టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లో సభ్యుడన్న విషయం తెలిసిందే. ఈసారి వరల్డ్‌కప్‌లో బాబరే ఎందుకు టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడన్న విషయంపై వీరూ మరింత వివరణ ఇచ్చాడు. విరాట్‌ కోహ్లిలాగే క్రీజులో బాబర్ నిలదొక్కుకోగలడని అన్నాడు.

"అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అతని ఆట చూడటం సరదాగా ఉంటుంది. విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు చూస్తే ఎలాంటి ఫీలింగ్‌ కలుగుతుందో బాబర్‌ ఆజం విషయంలోనూ అదే కలుగుతుంది" అని సెహ్వాగ్‌ చెప్పాడు. అటు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కూడా సెహ్వాగ్‌ అభిప్రాయంతో ఏకీభవించాడు. రిజ్వాన్‌తో కలిసి పాకిస్థాన్‌ టీమ్‌కు ఓపెనింగ్‌ చేస్తున్న బాబర్‌ చాలా నిలకడగా ఆడుతున్నాడని వాన్‌ అన్నాడు.

"ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో బాబర్‌ ఆజమే టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడు. అద్బుతమైన ప్లేయర్‌. పాకిస్థాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌. రిజ్వాన్‌తో కలిసి టాపార్డర్‌లో మంచి పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పుతున్నాడు. చాలా నిలకడగా ఆడుతున్నాడు. బాబర్‌ ఆజమే ఎక్కువ రన్స్‌ చేస్తాడు" అని వాన్‌ చెప్పాడు.

WhatsApp channel