Akhtar on Kohli: విరాట్‌ కోహ్లి ఇక టీ20ల నుంచి రిటైర్‌ కావాలి: షోయబ్‌ అక్తర్‌-akhtar on kohli says he should retire from t20s now ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Akhtar On Kohli Says He Should Retire From T20s Now

Akhtar on Kohli: విరాట్‌ కోహ్లి ఇక టీ20ల నుంచి రిటైర్‌ కావాలి: షోయబ్‌ అక్తర్‌

Hari Prasad S HT Telugu
Oct 25, 2022 05:33 PM IST

Akhtar on Kohli: విరాట్‌ కోహ్లి ఇక టీ20ల నుంచి రిటైర్‌ కావాలని అన్నాడు పాకిస్థాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ అక్తర్‌ ఈ కామెంట్స్ చేయడం విశేషం.

షోయబ్ అక్తర్, విరాట్ కోహ్లి
షోయబ్ అక్తర్, విరాట్ కోహ్లి (YouTube/Reuters)

Akhtar on Kohli: విరాట్ కోహ్లి టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నట్లు ఇది ఇండియన్‌ టీమ్‌కు అతడు ఆడిన బెస్ట్‌ ఇన్నింగ్స్‌. విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇది నిస్సందేహంగా ఓ మైలురాయిలా మిగిలిపోతుంది. ఎన్నాళ్లుగానో ఫామ్‌ కోసం తంటాలు పడిన విరాట్‌.. ఇప్పుడిలాంటి ఇన్నింగ్స్‌ ఆడటంతో అతని నుంచి ఇలాంటి మరెన్నో ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అయితే పాకిస్థాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్ మాత్రం ఇక అతడు టీ20ల నుంచి రిటైర్‌ కావాలని అనడం గమనార్హం. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అక్తర్ మాట్లాడుతూ.. విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు. "పాకిస్థాన్‌ అద్భుతంగా ఆడింది. దిగులు చెందొద్దు. మీరు నిజంగా బాగా ఆడారు. ఇండియా కూడా చాలా బాగా ఆడింది. చరిత్రలోని బెస్ట్‌ మ్యాచ్‌లలో ఒకదానిని వాళ్లు గెలిచారు.

ఇది సంపూర్ణంగా ఓ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌. ఇందులో అన్నీ ఉన్నాయి. డ్రాప్‌ అయిన క్యాచ్‌, రనౌట్‌, నోబాల్‌, వివాదాలు, స్టంపింగ్‌. వరల్డ్‌కప్‌ ఇప్పుడే మొదలైంది. ఇండియా, పాకిస్థాన్‌ ఆడినప్పుడే వరల్డ్‌కప్‌ మొదలవుతుంది. వాళ్లు మళ్లీ ఆడాలి. ఈ వరల్డ్‌కప్‌లో మరోసారి పాకిస్థాన్‌తో ఇండియా ఆడుతుంది" అని అక్తర్‌ అన్నాడు.

కోహ్లి తన జీవితంలోనే బెస్ట్‌ ఇన్నింగ్స్ ఆడాడని అక్తర్‌ చెప్పాడు. "కష్టకాలంలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ ప్రోది చేసుకోవాలి. ఒకసారి ఆత్మవిశ్వాసం పొందితే వ్యక్తిత్వం తిరిగి వస్తుంది. దాని పేరే విరాట్ కోహ్లి" అని అక్తర్‌ అన్నాడు. "నా ఉద్దేశం ప్రకారం అతడు జీవితంలోనే అతి పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాడు. తాను చేయగలనని నమ్మాడు కాబట్టే విరాట్‌ ఈ ఇన్నింగ్స్‌ ఆడగలిగాడు" అని అక్తర్‌ తెలిపాడు.

అయితే ఈ ఇన్నింగ్స్‌ కోసం విరాట్‌ చేసిన కృషితో వన్డేల్లో మూడు సెంచరీలు చేయగలడని, అందుకే టీ20ల నుంచి అతడు రిటైర్‌ కావాలని అక్తర్‌ అనడం విశేషం. "అతడు దీటుగా తిరిగి వచ్చాడు. అతడు టీ20ల నుంచి రిటైర్‌ కావాలని నేను అనుకుంటున్నాను. అతడు తన శక్తి మొత్తాన్నీ టీ20లపై కేంద్రీకరించకూడదు. ఇవాళ అతడు చూపిన నిబద్దతతో వన్డేల్లో మూడు సెంచరీలు చేయగలడు" అని అక్తర్ అన్నాడు.

WhatsApp channel