Messi Goal: 36 గజాల దూరం నుంచి మెస్సీ మరో కళ్లు చెదిరే గోల్.. వీడియో వైరల్-football news messi goal from 36 yards distance is his second longest ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Goal: 36 గజాల దూరం నుంచి మెస్సీ మరో కళ్లు చెదిరే గోల్.. వీడియో వైరల్

Messi Goal: 36 గజాల దూరం నుంచి మెస్సీ మరో కళ్లు చెదిరే గోల్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Aug 16, 2023 08:38 AM IST

Messi Goal: 36 గజాల దూరం నుంచి మెస్సీ మరో కళ్లు చెదిరే గోల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇంటర్ మియామీ తరఫున మెస్సీ తన డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నాడు.

ఇంటర్ మియామీ తరఫున చెలరేగిపోతున్న లియోనెల్ మెస్సీ
ఇంటర్ మియామీ తరఫున చెలరేగిపోతున్న లియోనెల్ మెస్సీ (AFP)

Messi Goal: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరో కళ్లు చెదిరే గోల్ చేశాడు. ఈసారి ఏకంగా 36 గజాల దూరం నుంచి అతడు గోల్ చేయడం విశేషం. ఈ గోల్ తో ఇంటర్ మియామీ టీమ్ 4-1తో ఫిలడెల్ఫియాపై గెలిచి లీగ్స్ కప్ ఫైనల్ చేరింది. ఇంటర్ మియామీ టీమ్ తరఫున ఆడటం మొదలుపెట్టిన తర్వాత మెస్సీ ఇలాంటి గోల్స్ తో అదరగొడుతున్నాడు.

ఫిలడెల్ఫియాతో మ్యాచ్ లో 20వ నిమిషంలో మెస్సీ కొట్టిన గోల్ మ్యాచ్ కే హైలైట్. నిజానికి ఇది అతని కెరీర్లో సెకండ్ లాంగెస్ట్ గోల్ కావడం విశేషం. ఇంటర్ మియామీ తరఫున ఈ మ్యాచ్ లో తన 9వ గోల్ నమోదు చేశాడు. అన్ని గోల్స్ కూడా ఈ లీగ్స్ కప్ లోనే కావడం విశేషం. పెనాల్టీ ఏరియా బయట 36 గజాల దూరం నుంచి మెస్సీ చేసిన గోల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

చాలా దూరం నుంచి వస్తున్న బాల్ గోల్ పోస్ట్ లోకి వెళ్లదులే అనుకున్నాడో ఏంటో ప్రత్యర్థి గోల్ కీపర్ ఆండ్రీ బ్లేక్ చివరి క్షణంలో డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. ఇంటర్ మియామీ తరఫున బరిలోకి దిగుతున్న ప్రతి మ్యాచ్ లో ఈ బార్సిలోనా మాజీ స్టార్ ప్లేయర్ ఏదో ఒక అద్భుతం చేస్తూనే ఉన్నాడు. తొలి ఐదు మ్యాచ్ లలోనే 8 గోల్స్ చేసిన మెస్సీ.. ఆరో మ్యాచ్ లో మరో గోల్ చేశాడు.

నిజానికి మంగళవారం (ఆగస్ట్ 15) ఫిలడెల్ఫియా యూనియన్ తో మ్యాచ్ గెలవడం అంత సులువు కాదని అందరూ భావించారు. కానీ మెస్సీ చేసిన ఈ మ్యాజిక్ గోల్ తర్వాత చెలరేగిన ఇంటర్ మియామీ ఏకంగా 4-1తో ప్రత్యర్థిని చిత్తు చేయడం విశేషం. మెస్సీని భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంటర్ మియామీ అంచనాలను అతడు అందుకుంటున్నాడు.

ఇంటర్ మియామీ తరఫున ఆడుతున్న ఆరో మ్యాచ్ లోనే ఆ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్ లిస్టులో మెస్సీ మూడోస్థానానికి చేరాడు. గొంజాలో హిగ్వేన్ (29), లియినార్డో కంపానా (16) తర్వాత 9 గోల్స్ తో మెస్సీ మూడోస్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరు ప్లేయర్స్ ఇంటర్ మియామీ తరఫున 50కిపైగా మ్యాచ్ లు ఆడారు. మెస్సీ జోరు చూస్తుంటే చాలా త్వరగానే వాళ్ల రికార్డును బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు.

సంబంధిత కథనం

టాపిక్