Spain Football President: కొంప ముంచిన ముద్దు - స్పెయిన్ ఫుట్‌బాల్ ప్రెసిడెంట్ సస్పెండ్
Spain Football President: ఉమెన్స్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్లేయర్‌కు ముద్దు ఇచ్చిన స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్‌ను ఫిఫా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.
Spain Football President: కొన్ని సార్లు గెలుపు సంబరాలు శృతిమించుతుంటాయి. వివాదాలకు దారితీస్తుంటాయి. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో అలాంటి సంఘటనే జరిగింది. మహిళా ఫుట్‌బాలర్‌కు ముద్దు ఇచ్చినందుకు స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్ ను ఫిఫా సస్పెండ్ చేసింది. ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్‌ను స్పెయిన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
గత ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై స్పెయిన్ 1-0 తేడాతో విజయాన్ని సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన సంబరాల్లో స్పెయిన్ ప్లేయర్ జెన్నీ హెర్మాసోకు లూయిస్ రూబియల్స్ లిప్ కిస్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది. రూబియల్స్‌తో గెలుపు సంబరాల్ని పంచుకోవడానికి అతడి దగ్గరకు వచ్చింది హెర్మాసో. కానీ ఆమె పెదవులపై ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు రూబియల్స్.
కావాలనే హెర్మాసోకు రూబియల్స్ ముద్దు ఇచ్చాడంటూ విమర్శలొచ్చాయి. అతడి తీరును క్రీడా వర్గాలతో పాటు అభిమానులు తప్పుపట్టారు. అతడి చర్యను ఫిఫా డిసిప్లినరీ కమిటీ సీరియస్ గా తీసుకుంది. ఫిఫా డిసిప్లినరీ కోడ్ ఆర్టికల్ 51 ప్రకారం రూబియల్స్‌ను సస్పెండ్ చేసింది. మూడు నెలల పాటు రూబియల్స్ నేషనల్, ఇంటర్‌నేషనల్ లెవెల్‌లో ఫుట్‌బాల్ గేమ్స్ కు దూరంగా ఉండాలని ఆదేశించింది.